Sunil Gavaskar: లెజండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చెప్పింది కూడా నిజమే. కానీ ఏది ఎలా రాసుంటే అలా జరుగుతుంది అనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కప్ గురించి. 18 ఏళ్ల నిరీక్షణను తెరదించుతూ ప్రతీ మ్యాచ్‌ను కీలకంగా తీసుకుని రజత్ పాటిదార్ నేతృత్వంలో ఎట్టకేలకు బెంగళూరు కప్ గెలిచింది. వరుసగా గెలిచే వారి ఆనందానికే అవధులుండవు. అలాంటిది 18 ఏళ్లుగా ఎన్నో తిట్లు తింటూ.. అవమానాలు, ఎగతాళులు భరిస్తూ.. చివరికి మీమ్ మెటీరియల్‌గా మారిపోయిన బెంగళూరు కప్ గెలిచాక ఆ టీం అభిమానులు ఊరుకుంటారా?
సాధారణ ప్రజలు, అభిమానులే కాదు.. కర్ణాటక ప్రభుత్వం కూడా వారిని కప్ గెలిచిన మరుసటి రోజే వారిని సత్కరించాలని అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ ఆ ఏర్పాట్లను ఇంకాస్త నిశితంగా పరిశీలించి ఉంటే ఆ 11 మంది అమాయకుల ప్రాణాలు పోకుండా ఉండేవి. 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్ గెలిచింది అనే విషయాన్ని యావత్ భారతదేశం ఎంత వరకు గుర్తుంచుకుంటుందో తెలీదు కానీ.. కప్ గెలిచిన తర్వాత 11 మంది మరణించారు అన్న విషయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు. ప్రతి సంవత్సరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరిగిన ప్రతి సారీ ఆ విషాదగాథను తలుచుకోవాల్సిన పరిస్థితి.
ముందే గెలిచుంటే
ఈ నేపథ్యంలో సునీల్ గవాస్కర్ ఓ మాటన్నారు. రాయల్ ఛాలెంజర్స్ 18 ఏళ్ల తర్వాత కప్ గెలిచింది అని. కానీ ఇంకాస్త ముందే గెలిచి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదేమో అని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ఇతర టీమ్స్ టైటిల్ గెలిచినప్పుడు ఈ రేంజ్‌లో సంబరాలు జరుపుకోలేదని.. బెంగళూరు టీం కూడా కాస్త త్వరగా కప్ కొట్టి ఉంటే ఇంతటి ఘోర ఘటన జరిగి ఉండేది కాదు అనిపించిందని అన్నారు.
కోహ్లీపై కేసు
ఈ ఘటన జరిగిన నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై కేసు నమోదైంది. చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాటకు కోహ్లీ కారణమని.. అతన్ని చూసేందుకే అభిమానులు లక్షలాది సంఖ్యలో వచ్చారని ఫిర్యాదు చేయడంతో బెంగళూరులో కేసు నమోదు చేసారు. అయితే.. కేసు నమోదు అవడానికి ముందే కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో లండన్ వెళ్లిపోయినట్లు ఎయిర్‌పోర్ట్ విజువల్స్ కూడా వచ్చాయి. మరి కోహ్లీ ఇక్కడే ఉంటే యాక్షన్ తీసుకుంటారా? లేక లండన్ వెళ్లిపోవడంతో కేసు కొట్టేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.