Tholi Ekadasi: నేడు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈరోజు నిర్జల ఏకాదశి. దీనినే మనం తొలి ఏకాదశిగా జరుపుకుంటాం. ఏకాదశి అనగానే చాలా మందికి ఠక్కున గుర్తొచ్చేవి రెండే.. విష్ణుమూర్తి, ఆయన కోసం చేసే ఉపవాసం. ఏకాదశికి ఉపవాసం చేస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ అసలు ఏకాదశి అనేది కేవలం తిథి మాత్రమే కాదు.. అదొక అమ్మాయి పేరు అని తెలుసా? ఈ విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం.
ఏకాదశి నాడు విష్ణు పూజ చేస్తాం. ఈ వర్షాకాలానికి ముందొచ్చే ఏకాదశి ఏంటంటే.. ఈ సమయంలో విష్ణు మూర్తి నిద్రపోతారు. నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉంటారు. మన ఒక నిద్ర లాగే ఆయనకు నాలుగు నెలల నిద్ర ఉంటుందన్నమాట. ఈ సమయంలో ఆయన్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వాలి. ఆయన సమయమైన ఏకాదశి ఆయనకు ఎంతో ఇష్టమైనది. విష్ణుమూర్తి ఒకప్పుడు మురాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసారు. ఆ రాక్షసుడు బ్రహ్మవరప్రసాదుడు. దాంతో విష్ణుమూర్తి వాడిని ఓడించలేకపోతాడు. అలిసిపోతారు. అలా ఒక గుహలోకి ప్రవేశించి యుద్ధం నుంచి స్వామివారు విశ్రమించారు.
ఆ సమయంలో మురాసురుడు లోపలికి ప్రవేశిస్తాడు. అక్కడ స్వామి నిద్రపోతుండడం చూసి ఆయనపై పడబోతాడు. ఆ సమయంలో స్వామివారి నుంచి ఒక తెరలా ఓ ఆడ రూపం బయటికి వచ్చి ఆ రాక్షసుడిని సంహరిస్తుంది. అలా స్వామి నుంచి ఆడ రూపంలో బయటికి వచ్చిన అమ్మాయి శ్రీవారు తన బిడ్డగా భావించి ఆమెకు ఏకాదశి అని పేరు పెడతారు. ఏకాదశి నాడు ఎవరైతే తనను ఆరాధించి.. ఆ రోజున ధాన్యం తినకుండా.. ఉపవాసం ఉంటారో వారిపై తన కృప ఎప్పుడూ ఉంటుంది అని వరం ఇస్తారు. అంటే.. తన నుంచి బయటికి వచ్చి తన ప్రాణం కాపాడిన ఏకాదశి అంటే స్వామి వారికి ఎంత ప్రీతో.. ఆ రోజున ఉపవాసం ఉండి విష్ణు పూజ చేసే వారన్నా కూడా స్వామివారికి అంతే ప్రీతి ఉంటుందన్నమాట.
ధాన్యం ఎందుకు తినకూడదు?
ఏకాదశి నాడు సాధారణంగా కేవలం పండ్లు, నీళ్లు మాత్రమే తీసుకుంటారు. తినకుండా ఉండలేని వారు ధాన్యం కాకుండా ప్రత్యామ్నాయంగా ఏదైనా వండుకుని తింటారు. మరి ధాన్యం ఎందుకు తినకూడదు? దీని వెనుక ఓ కారణం ఉంది. స్వామి వారం నుంచి ఆడ రూపం బయటికి వచ్చి మురాసురుడిని వధించబోతుంటే ఆ రాక్షసుడు భయపడి అక్కడ రాశులుగా పోసిన బియ్యంలో దాక్కుంటాడు. అందుకే ఏకాదశి రోజున బియ్యంతో వండినవి ఏవీ తినకూడదు అని చెప్తారు. ఇక స్వామి వారికి ప్రసాదం అనగానే బియ్యం పాయసం చేసేస్తుంటారు. ఈ తొలి ఏకాదశి లేదా నిర్జల ఏకాదశి నాడు ఎప్పుడూ కూడా స్వామి వారికి బియ్యంతో వండినది ఏదీ ప్రసాదంగా సమర్పించకూడదు అని గుర్తుంచుకోండి.
ఎప్పుడు తినాలి?
ఏకాదశి రోజున ఉపవాసం చేసేవారు.. మరుసటి రోజున అంటే ద్వాదశి రోజున పారణ చేయాలి. పారణ అంటే ఉపవాసాన్ని విడవటం. ఆ రోజున విష్ణు పూజ చేసుకుని స్వామికి నైవేధ్యాలు పెట్టి వాటిని స్వీకరిస్తే ఎంతో మంచిది. ఏకాదశి నాడు మనం విష్ణు స్మరణ మానకూడదు. ఏకాదశి నాడు కొంతమంది జొన్న పేలాలు వేయించి.. అందులో బెల్లం కలిపి ఉండలు చేసి నైవేధ్యంగా పెడుతుంటారు. ఏకాదశి నాడు జొన్న పేలాలను ఎవరికైతే దానం చేస్తే.. ఎన్ని పేలాలు చేత్తో ఇస్తే అన్నేళ్ల పాటు మరణాంతరం స్వర్గంలోనే ఉంటారని పెద్దలు చెప్తారు.