Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చోరీకి వెళ్లి అతనిపై దాడి చేసిన వ్యక్తిని ఎట్టకేలకు ముంబై పోలీసులు నిన్న రాత్రి అరెస్ట్ చేసారు. నిందితుడి పేరు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్. ఇతను గత ఆరు నెలలుగా ముంబైలో ఉంటున్నాడని.. కానీ భారతీయుడు మాత్రం కాదని పోలీసులు చెప్తున్నారు. ఇతను బంగ్లాదేశ్ వాసని.. అక్రమంగా ఆరు నెలల క్రితమే భారత్‌లో అడుగుపెట్టాడని అంటున్నారు. నిందితుడు దొరికాడు అతని పేరు ఇది అని వివరాలన్నీ బయటికి రాగానే.. చాలా మంది అతను వేరే మతానికి చెందినవాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
కానీ ముంబై కోర్టు న్యాయమూర్తి మాత్రం వేరే కోణంలో ఆలోచించారు. నిందితుడిని ఈరోజు ఉదయం కోర్టులో ప్రవేశపెట్టగా.. అతను బంగ్లాదేశ్ వాసి అని.. విచారణ చేపట్టడానికి కనీసం పది రోజులు కావాలని పోలీసులు కోరారు. ఇందుకు నిందితుడి తరఫు న్యాయవాది మాత్రం అంగీకరించలేదు. ముంబై పోలీసులు ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారే నిందితుడు అని నమ్మించే యత్నం చేసారని.. కానీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన వ్యక్తి ముఖం వారు పట్టుకున్న అనుమానితుల ముఖాలు కలవకపోవడంతో ఎవ్వరూ నమ్మరని.. ఈరోజు వేరే వ్యక్తిని పట్టుకుని అతనే నిందితుడు అంటున్నారని వాదించారు. (Saif Ali Khan)
వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి ఒక ఆసక్తికరమైన కామెంట్ చేసారు. అసలే బంగ్లాదేశ్‌కు భారత్‌పై పీకలదాకా కోపం ఉంది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అక్కడి నుంచి పారిపోయి మన దగ్గరే తలదాచుకున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ భారత్‌తో కటీఫ్ అంటూ వేరే దేశాలతో పొత్తులు పెట్టుకుంటోంది. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన వ్యక్తి బంగ్లాదేశ్ వాసి అనడంతో ఆ న్యాయమూర్తి ఈ కేసు వెనక అంతర్జాతీయ కుట్ర ఉన్నట్లు అనుమానంగా ఉందని అన్నారు. అది నిజమో కాదో తేలాలి కాబట్టి క్షేత్రస్థాయిలో విచారణ జరగాలని వెల్లడిస్తూ ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించారు.
దీనిపై నిందితుడి తరఫు వాదనలు వినిపిస్తున్న డిఫెన్స్ లాయర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఒక సాధారణ వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగి ఉంటే ఈ కేసు ఇంత ప్రాధాన్యత సంతరించుకునేది కాదని.. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో జరగడంతో అతను బంగ్లాదేశ్ వాసి అంటూ ఓ అమాయకుడిని ఇరికించాలని చూస్తున్నారని అన్నారు. న్యాయమూర్తి దీని వెనుక అంతర్జాతీయ ముఠా ఉందని అనకపోయి ఉంటే ఈరోజే తీర్పు వెల్లడించేవారని అన్నారు. నిందితుడు ఆరు నెలలుగా మాత్రమే ముంబై ఉంటున్నాడని ఆరోపిస్తున్నారని.. అతను బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చి చాలా సంవత్సరాలు అవుతోందని.. కానీ కేసులో అన్ని విషయాలు మార్చేసి ఎవరికి వారు తీర్పులు ఇచ్చేసుకుంటున్నారని తెలిపారు. (Saif Ali Khan)