Ratha Saptami 2025: రథాన్ని ప్రతినిత్యం నడిపేవారు ఎవరంటే మనకు ఠక్కున గుర్తొచ్చేది సూర్య భగవానుడు. సప్తమి నాడు ఆయన జన్మించాడు కాబట్టి ఆ రోజు మనం రథ సప్తమిగా జరుపుకుంటాం. కాబట్టి.. ఈ రథ సప్తమి సూర్యుడు పుట్టిన సమయం చూసుకుంటే చాలా మంది తెలీని విషయం ఒకటి ఉంది. కశ్యప ప్రజాపతికి అదితికి పుట్టినవాడు ఈ సూర్యభగవానుడు. ఎక్కడ పుట్టాడంటే.. సుమేరు పర్వత ప్రాంతంలో పుట్టాడు. ఇప్పుడు ఈ సుమేరు జపాన్‌లో ఉంది.
కాబట్టి ప్రపంచంలో కూడా మొట్టమొదటి సూర్యోదయం అక్కడే అవుతుంది. అందుకే అక్కడ సూర్యుడి లక్షణాలు కలిగిన మనుషులు ఎక్కువగా ఉంటారట. ఆదిత్యుడంటేనే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. అందుకే జపాన్‌లో వృద్ధులు ఎక్కువగా ఉంటారని.. దానికి కారణం ఆదిత్యుడు వారికి ప్రసాదిస్తున్న ఆరోగ్యమే అని చెప్తుంటారు. వాళ్లకు ఉండే ప్రధానమైన లక్షణం.. ఎప్పటికప్పుడు ఏ రోజు పని ఆరోజు పూర్తి చేసేస్తారు. అంటే క్రమశిక్షణ కలిగిన జీవితం సూర్య భగవానుడి నుంచే వస్తుంది. సాధారణంగా అనారోగ్యాలు లేని ప్రదేశం జపాన్. ఈ రథ సప్తమి రోజున ఆదివారంతో వచ్చి ఉంటే మహా అద్భుతమైన యోగ కాలం అని చెప్పచ్చు. కానీ మనకు మంగళవారం వచ్చింది.
Ratha Saptami రథ సప్తమి రోజున ప్రధానంగా కొన్ని నియమాలు పాటించాలి. ఏంటా నియమాలు అంటే.. ఆ రోజున ధూమ పానం, మధ్యపానం, మాంసాహారం, దాంపత్యం పనికిరావు. తామసికమైన ఆహారం తీసుకోకూడదు. అంటే అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటివి తీసుకోకూడదు. ముఖ్యంగా ఆ రోజున అవకాశం ఉంటే పాలు, పండ్లు తీసుకుంటూ ఉపవాసం చేస్తే మరీ మంచిది. స్నాన విధానం మాత్రం రథ సప్తమికే ప్రత్యేకంగా చెప్పబడింది. మనం బ్రహ్మ ముహూర్త కాలంలో లేచి కాళ్ల కృత్యాలు తీర్చుకుని అరుణోదయం.. అంటే సూర్యుడు రాకముందు ఆకాశం కాస్త ఎర్రగా ఉన్నప్పుడే స్నానం ఆచరించాలి. స్నానం చేసేటప్పుడు 7 జిల్లెడు ఆకులు కానీ, 7 రేగి ఆకులు కానీ తలపై పెట్టుకుని నీళ్లు పోసుకోవాలి. కుదిరితే భుజాలపై కూడా పెట్టుకుని స్నానం చేస్తే మరీ మంచిది.
ఏడు జన్మల నుంచి నేను జన్మిస్తూ వస్తున్నాను.. ఆ ఏడు జన్మల్లో నాకు తెలిసి కానీ తెలీక కానీ చేసిన పాపాలు, రహస్యంగా చేసిన పాపాలు కానీ, అవన్నీ నశించిపోయి కొత్త జీవితాన్ని నేను ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నాను. ఈ జన్మలో నేను చేసిన పాపాలు కూడా తొలగిపోవాలి అనే భావంతో తూర్పు వైపు నమస్కారం చేసుకుని తలంటుకోవాలి. షష్ఠి రోజున అంటే సప్తమికి ముందు రోజు నల్ల నువ్వుల ముద్దను శరీరానికి పట్టించుకుని స్నానం చేయాలి. సప్తమి రోజున జిల్లేడు ఆకులను తలపై పెట్టుకుని తలంటుకోవాలి.
Ratha Saptami సప్తమి రోజున మాత్రం నూనె ఒంటికి కానీ తలకు కానీ రాసుకోకూడదు. ఉదయిస్తున్న సూర్యుడికి నమస్కారం చేసుకుని సూర్యాష్టకం ఆరు సార్లు చదివి, ఆరు సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. తర్వాత దేవతా పూజ చేసుకోవాలి. చిక్కుడు కాయ గింజలతో రథాన్ని తయారుచేసుకోవాలి. మధ్యలో చిక్కుడు ఆకులను పెట్టి దానిపై సూర్యుడి ఆకారాన్ని గంధంతో వేసుకోవాలి. మీ దగ్గర చిన్న ఫోటో ఉంటే అదే పెట్టుకోండి. ఆ రోజున ఎరుపు రంగు దుస్తులు వేసుకోవాలి. పూజా సమయంలో నైవేధ్యంగా ఆవు పాలు, నెయ్యి, కొత్త బియ్యం, బెల్లంతో చేసిన పాయసం పెడితే మరీ మంచిది. పూజ ముగిసాక ఆదిత్య హృదయం, విష్ణు సహస్ర పారాయణం కానీ చేసుకుంటే ఎంత మంచిది. రథ సప్తమి తర్వాత చిక్కుడు కాయలను తినకూడదు అని చెప్తారు. ఎందుకంటే అదే సమయంలో చిక్కుడు మొక్కలకు పురుగు పడుతుందట. అందుకని సప్తమి తర్వాత చిక్కుడు తినకూడదు అని చెప్తారు.