Ram Charan Allu Arjun: మెగా, అల్లు కుటుంబంలో ఎప్పటినుంచో కలహాలు ఉన్నాయన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. అది కాస్త గతేడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మరింత ముదిరింది. జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలిసి అల్లు అర్జున్ (Allu Arjun) ఆయనకు మద్దతు తెలపకుండా.. YSRCP నేత శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డికి మద్దతు తెలపడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన తర్వాత సాయి ధరమ్ (దుర్గ) తేజ్ అల్లు అర్జున్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో అయ్యారు. దాంతో ఈ కుటుంబాల మధ్య వివాదం మరింత ముదిరిందని క్లారిటీ వచ్చేసింది.
కానీ ఇప్పుడు రామ్ చరణ్ అల్లు అర్జున్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం సంచలనంగా మారింది. అవును.. రామ్ చరణ్.. తాను ముద్దుగా బన్నీ అని పిలుచుకునే అల్లు అర్జున్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో అయ్యారు. నిన్న చిరంజీవి బ్రహ్మానందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన వారసుడు పవన్ కళ్యాణే అని చెప్పకనే చెప్పారు. మొన్న జరిగిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కాస్తా జనసేనగా మారిందని.. తాను రాజకీయ పెద్దలను కలిసేది సినీ పరిశ్రమ అభివృద్ధి కోసమే అని చెప్పారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే చరణ్ బన్నీని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తెలిసి చరణ్, బన్నీ ఫ్యాన్స్ మళ్లీ ఫ్యాన్ వార్స్ స్టార్ట్ చేసారు. అసలు ఎప్పుడో అన్‌ఫాలో చేయాల్సింది అంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే.. రామ్ చరణ్ బన్నీని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో అయ్యారే కానీ ఆయనతో దిగిన ఫోటోలను మాత్రం డిలీట్ చేయలేదు.