Manchu Vishnu: మంచు కుటుంబంలో కొంతకాలంగా జరుగుతున్న గొడవల గురించి చూస్తూనే ఉన్నాం. బహుశా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద నటుడి కుటుంబంలో ఈ రేంజ్‌లో గొడవలు జరగడం ఇదే మొదటిసారి కాబోలు. ఈ గొడవకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది.. మనోజ్‌తో ఉన్న ఇబ్బందులు ఏంటి.. వంటి అంశాలపై విష్ణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
అవే సర్దుకుంటాయి
ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి. మా ఇంట్లో గొడవలు జరగడం.. అది నలుగురి నోట్లో నానడం మాక్కూడా నచ్చడం లేదు. కానీ మీడియా వాళ్లు చేసే కొంత అతి వల్ల మేం ఇబ్బందిపడాల్సి వస్తోంది. 90% మీడియా మంచివాళ్లే. కానీ మిగతా 10 శాతం మంది లేనిపోనివి కల్పించి రాస్తుంటారు. దేనికైనా సమయం ఇవ్వాలి. దెబ్బ తగిలింది. అది మానడానికి కాస్త సమయం పడుతుంది. కానీ కచ్చితంగా మానిపోతుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. నేను అదే నమ్ముతాను.
నాన్న తగ్గితేనే నేను తగ్గుతా
మా నాన్న చాలా బాధపడుతున్నారు. ఆయన బాధ చూడలేకపోతున్నా. నాకు మా అమ్మానాన్నలంటే ఎంతో గౌరవం, భయం కూడా. ఎందుకంటే నేను చేసే పనులు అలాంటివి. మా అమ్మ చాలా ఇబ్బందిపడుతోంది ఈ గొడవల కారణంగా. రేపో మాపో మాపై చేయి చేసుకుంటుందేమో అనిపిస్తోంది. మనోజ్ విషయంలో నాన్న బాధ, కోపం తగ్గితేనే.. నేను కూడా తగ్గుతాను. ఆయన మాటే శాసనం. ఎందుకంటే మా ఇంటికి ఆయనే పెద్ద దిక్కు. (Manchu Vishnu)
లాల్ అంకుల్ ఫోన్ చేసారు
మా ఇంట్లో గొడవ జరుగుతోందన్న విషయం టీవీల్లో రాగానే అన్ని చిత్ర పరిశ్రమల్లోని నా స్నేహితులు ఫోన్ చేసి పరామర్శించారు. మోహన్ లాల్ అంకుల్ ముందు నాకు ఫోన్ చేసారు. నన్ను రమ్మంటావా.. అంతా ఓకేనా అన్నారు. నేను చెప్పినప్పుడు రండి అంకుల్ ఇప్పుడు వద్దు అన్నాను. మా నాన్న పట్ల ఇతర చిత్ర పరిశ్రమల్లో ఉన్నవారికి గౌరవం అలాంటిది.
మనోజ్‌కి అవకాశం
కన్నప్ప సినిమాపైనే నా దృష్టి అంతా ఉంది. ఈ కుటుంబ గొడవలు ఎప్పుడూ ఉండేవే. నేను ఎవ్వడికీ భయపడను. నేను నా తల్లిదండ్రుల తర్వాత భయపడేది కేవలం నా భార్య విన్నీకే. అంతేకానీ ఎవ్వడికీ భయపడాల్సిన అవసరం నాకు లేదు. సినిమాలో మా అక్కకు, మనోజ్‌కు అవకాశం ఇవ్వకపోవడానికి కారణం ఇది కుటుంబ కథా చిత్రంలా ఉండకూడదని. అందుకే వారికి అవకాశం ఇవ్వలేదు. నా ఫ్రెండ్‌కి నేను ఒక క్యారెక్టర్ ఇచ్చాను. కానీ శివబాలాజీకి అవకాశం ఇస్తే బాగుంటుంది అనిపించి నా ఫ్రెండ్‌ని తీసేసి బాలాజీకి ఆ క్యారెక్టర్ ఇచ్చాను. అందుకు ఇప్పటికీ పాపం వాడు నాపై కోపంతో ఉన్నాడు. అతని పేరు చెప్పకపోవడమే మంచిది.
ఒకవేళ మనోజ్‌కి తగ్గ పాత్ర ఉండి ఉంటే కచ్చితంగా అవకాశం ఇచ్చేవాడినేమో. అక్షయ్ కుమార్‌ని శివుడి క్యారెక్టర్‌కి ఒప్పించేందుకు కొన్ని నిమిషాలు పట్టింది. ఆయన కథ వినగానే ఈ సినిమాకు నేను పెట్టిన డబ్బు కంటే పదింతలు ఎక్కువ వసూళ్లు రాబడుతుందని అన్నారు. అంతా శివుడిపై వదిలేసి సినిమా రిలీజ్ చెయ్యి అంతా ఆయనే చూసుకుంటాడని అన్నారు. ఆ ధైర్యంతోనే ఏప్రిల్‌లో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా. (Manchu Vishnu)