Manchu Family Fight: మంచు కుటుంబంలో వివాదం రోజురోజుకీ ముదురుతోంది. కొన్ని రోజుల క్రితం మంచు మోహన్ బాబుకి ఆయన చిన్న కుమారుడు మనోజ్‌కు మధ్య మనస్పర్ధలు రావడం.. ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు ఇన్‌వాల్వ్ అయ్యి వారికి నచ్చజెప్పేందుకు యత్నించారు. ఇప్పుడు పరిస్థితి కాస్త సర్దుమణిగింది అనుకుంటున్న సమయంలో ఈరోజు మనోజ్ తిరుపతిలోని విద్యానికేతన్ కాలేజ్‌కు వెళ్లారు. అయితే ఆయన కాలేజ్ లోపలికి వస్తారని ముందే ఊహించిన మోహన్ బాబు సెక్యూరిటీకి సమాచారం అందించి గేట్లు మూసేయాలని చెప్పారట. దాంతో తిరుపతిలో మోహన్ బాబు కాలేజ్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఈరోజు నారావారి పల్లికి చేరుకోనున్నారు. ఆయన తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి భారీ కాన్వాయ్ మధ్య నారావారి పల్లికి చేరుకోనున్నారు. దాంతో మనోజ్ లోకేష్‌ను కలిసి తన పట్ల జరుగుతున్న అన్యాయాన్ని వివరించనున్నారట. ఇవన్నీ చర్చించాక నారా లోకేష్ కాలేజ్‌లోకి వెళ్లమంటే వెళ్తారట. లేదంటే రంగంపేటలో జరిగే జల్లికట్టుకు మనోజ్ తన భార్య మౌనికా రెడ్డితో కలిసి వెళ్తారని సమాచారం.
ఆస్తి విషయంలో మంచు మోహన్ బాబుకు మనోజ్‌కు మధ్య గొడవలు జరుగుతున్నాయని టాక్. మోహన్ బాబు తన పెద్ద కుమారుడైన మంచు విష్ణు వైపే ఉండటం.. విష్ణు, మనోజ్‌కు పెళ్లికి ముందు నుంచే గొడవలు ఉండటంతో ఆ కుటుంబంలో ఎన్నో వివాదాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మనోజ్ మోహన్ బాబు కాలేజ్‌కి వెళ్లాలనుకోవడం.. ఇది తెలిసి మోహన్ బాబు కాలేజ్ గేట్లు మూయించేయడం వివాదాస్పదంగా మారింది. ఆల్రెడీ హైదరాబాద్‌లో మంచు ఫ్యామిలీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని పోలీసులు స్టేషన్‌కి పిలిచి మరీ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో వేచి చూడాలి. (Manchu Family Fight)
నేనేమన్నా మర్డర్ చేసానా?
నారావారి పల్లెలోని తన తాతగారు, నానమ్మ సమాధుల వద్దకు వెళ్లి వారికి నివాళులు అర్పించేందుకు వచ్చానని అన్నారు మంచు మనోజ్. తన భార్య మౌనికతో కలిసి మనోజ్ కారులో నారావారి పల్లె చేరుకున్నారు. అక్కడ తన తాతయ్య, నానమ్మ సమాధులు ఉన్నాయని.. కేవలం కనుమ పండుగ కావడంతో నివాళులు అర్పించేందుకే వచ్చానని అన్నారు. ఈ నేపథ్యంలో ఓ మీడియా వ్యక్తి నివాళులు అర్పించేందుకు మీ నాన్నగారి అనుమతి తీసుకున్నారా? అని అడిగారు. దీనికి మనోజ్ స్పందిస్తూ.. మీ తాతగారు, నానమ్మలను చూసేందుకు మీరు అనుమతి అడుగుతారా? ఇట్లా మాట్లాడితే ఎలా అన్నా? నేను గొడవ చేయడానికి రాలేదు. గొడవ చేయాలనుకుంటే ఇంత ఉత్సాహంతో రాను. కనుమ పెద్దల పండుగ కావడంతో నాకు ఎందుకు ఇలా జరుగుతోందో అని తాతయ్య, నానమ్మలను అడగాలని అనుకుంటున్నాను. ఆ తర్వాత చంద్రగిరి పోలీసులను కానీ లేదా నారావారి పల్లి పోలీసులను కానీ కలిసి తర్వాత ఏం చేయాలి అనే దాని మీద నిర్ణయం తీసుకుంటాను. నేనేమన్నా మర్డర్ చేసానా? తమ్ముడినే కదా? ఏమంత పెద్ద తప్పు చేసా నేను. నా ముఖం మీద తలుపులు వేయాల్సిన అవసరం ఏముంది? నా ఇంట్లో వాళ్లు ఎంత భయపడుతున్నారో చూడండి అని బాధపడ్డారు మనోజ్. (Manchu Family Fight)