Maha Kumbh Mela: మహా కుంభమేళా జరుగుతున్న సమయంలో ఈరోజు ఓ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ గుడిసెలో సిలిండర్ పేలడంతో చుట్టు పక్కన ఉన్న దాదాపు 20 గుడిసెలు కాలిపోయాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే.. కుంభమేళా ఎప్పుడు జరిగినా కూడా ఏదో ఒక ప్రమాదం జరుగుతూ వస్తోంది. హమ్మయ్య ఈసారి కుంభమేళా ఎలాంటి ప్రమాదాలు లేకుండా జరిగిపోయింది అని ఊపిరి పీల్చుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళా 144 ఏళ్ల తర్వాత వచ్చింది. అందుకే కోట్లాది మంది భక్తులు కుంభమేళాకు వెళ్లి స్నానాలు ఆచరించి వస్తున్నారు. విదేశీయులు కూడా రావడానికి ఇదే కారణం. అయితే.. కుంభమేళా జరిగిన ప్రతీసారి ఏదో ఒక ప్రమాదం జరుగుతోంది. గతంలో జరిగిన కుంభమేళాల్లో కూడా ఘోరమైన ప్రమాదాలు జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది?
ముందు మనం కుంభమేళా గురించి తెలుసుకుందాం. ఈ కుంభ మేళాలు ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, నాశిక్, ఉజ్జయినిలో నిర్వహిస్తారు. కుంభమేళా అనేది నాలుగు రకాలు. పూర్ణ కుంభ మేళా, అర్థ కుంభ మేళా, మహా కుంభ మేళా, కుంభ మేళా. పూర్ణ కుంభ మేళా అంటే 12 ఏళ్లకు ఓసారి వచ్చేది. ఇది ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతుంది. ప్రయాగ్‌రాజ్‌లో గంగ, యమునా, సరస్వతి సంగమం ఉంటుంది. దీనినే త్రివేణి సంగమం అంటారు. అర్థ కుంభ మేళా అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు నిర్వహిస్తారు. ఇది ప్రయాగ్‌రాజ్, హరిద్వార్‌లో జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న మహా కుంభ మేళా అనేది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 12 పూర్ణ కుంభాలను కలిపితే ఈ మహా కుంభమేళా అవుతుంది. ఈ మహా కుంభ మేళా కూడా ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోంది. ఇక కుంభమేళా అనేది 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. హరిద్వార్, నాశిక్, ఉజ్జయినిలో ఇది జరుగుతుంది. ఈ కుంభమేళా వచ్చిన ప్రతిసారి పవిత్ర నదుల్లో స్నానాలు ఆచరిస్తే పాపాలన్నీ పోయి మోక్షం కలుగుతుందని నమ్ముతారు. (Maha Kumbh Mela)
కుంభమేళాలో జరిగిన ప్రమాదాలు
కుంభమేళా సమయంలో జరిగిన నాలుగు ప్రమాదాలు ఇప్పటికీ గుర్తుండిపోతాయనే చెప్పాలి. 1995లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభ మేళా భక్రజన సంద్రంగా మారిపోయింది. ఇప్పుడు కోట్లల్లో వస్తుంటే అప్పట్లో లక్షల్లో మేళాకు వెళ్లేవారు. ఆ సమయంలో ఇప్పుడున్న టెక్నాలజీ లేదు. వసతులు లేవు. దాంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 300 మంది చనిపోయారంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. అధికార యంత్రాంగంలో లోపాల కారణంగా ఈ ఘోరం జరిగింది. కుంభమేళా చరిత్రలోనే ఈ ఘటన విషాదకరమైనదని చెప్తుంటారు.
ఆ తర్వాత 2013లో జరిగిన కుంభమేళాలో ఇదే మాదిరి తొక్కిసలాట జరిగింది. ప్రయాగ్‌రాజ్ (నాడు అలహాబాద్)లో రైల్వే స్టేషన్ దగ్గర తొక్కిసలాట జరగడంతో 36 మంది మృత్యువాతపడ్డారు. అప్పట్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్లు లేకపోవడమే ఈ ప్రమాదం జరిగడానికి ప్రధాన కారణం అని చెప్పచ్చు. 2010లో హరిద్వార్‌లో కుంభమేళా జరిగింది. అప్పుడు కూడా భక్తులు విపరీతంగా రావడంతో తొక్కిసలాట జరిగి ఏడుగురు చనిపోయారు. దీనికి ప్రధాన కారణం కుంభమేళాలో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు ఒకే చోట ఉండటమే.
ఈరోజు మహా కుంభమేళాలో జరిగిన అగ్ని ప్రమాదం మాదిరి లాంటిదే 2003లో నాశిక్ కుంభమేళాలో జరిగింది. భక్తుల కోసం వేసిన తాత్కాలిక టెంట్లు మంటల్లో కాలిపోయాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలు ఆర్పే ప్రయత్నం చేయడంతో ప్రమాదం తప్పింది. ఈరోజు కూడా ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే పెను ప్రమాదం తప్పింది అనుకోవాలి. ఎందుకంటే సాధారణ కుంభ మేళాలకు వెళ్లే వారి కంటే 144 ఏళ్ల తర్వాత వచ్చే మహా కుంభమేళాలకు విపరీతంగా పోటెత్తుతుంటారు. ఈ సమయంలో ప్రభుత్వం తీసుకునే చర్యలు, చేసే ఏర్పాట్లే వారి రక్షణకు కీలకంగా మారతాయి. (Maha Kumbh Mela)
అయితే.. కుంభమేళా ఎప్పుడు జరిగినా మానవ తప్పిదం వల్లైనా.. లేక ప్రకృతి వైపరిత్యం వల్లైనా ఏదో ఒక ప్రమాదం జరిగి తీరుతుందని అంటుంటారు. ఆ ప్రమాదం జరిగినప్పుడు ప్రాణ నష్టం జరగచ్చు జరగకపోవచ్చు. కానీ ప్రమాదం జరగడం మాత్రం తథ్యం అనే టాక్ అయితే ఉంది.