Katrina Kaif బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ తల్లికాబోతున్నారు. ఈ విషయాన్ని కత్రినా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఇప్పటికే కత్రినాకు ఆరు నెలలకు నిండినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో కత్రినా, విక్కీ కౌశల్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ వారు వెంటనే స్పందించాలని కానీ ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలని కానీ అనుకోలేదు. నవరాత్రులు కావడంతో ఈ శుభవార్త చెప్పడానికి ఇదే మంచి సమయం అని భావించారట. తనకంటే ఐదేళ్లు చిన్నవాడైన బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌ను కత్రినా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2021లో వీరి వివాహం రాజస్థాన్‌లో అట్టహాసంగా జరిగింది.
వీరిద్దరూ ప్రేమలో పడటానికి అది కాస్తా వివాహానికి దారి తీయడానికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్. ఆయన హోస్ట్ చేసే కాఫీ విత్ కరణ్ షోకి ఓ సారి కత్రినా గెస్ట్‌గా వచ్చారు. అప్పుడు కరణ్ ఓ ప్రశ్న అడిగారు. మీరు ఏ హీరో పక్కన చూడటానికి చక్కగా ఉంటారు అని అడిగాడు. ఇందుకు కత్రినా స్పందిస్తూ.. విక్కీ కౌశల్ అని చెప్పారు. అప్పటికే కత్రినాకి విక్కీ అంటే ఇష్టం ఉంది. ఆ తర్వాత ఇదే షోకి విక్కీ కౌశల్ వచ్చారు. అప్పుడు కత్రినా మీ పక్కన ఉంటే మీ జంట చూడటానికి బాగుంటుందని కత్రినానే స్వయంగా నాతో చెప్పింది అని కరణ్ విక్కీ కౌశల్‌కి చెప్పారు. అది విక్కీ షాక్‌లో సోఫాలోనే పడిపోయారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి జంటగా కనిపించడం.. ఆ తర్వాత పెళ్లితో అభిమానులను సర్‌ప్రైజ్ చేయడం జరిగాయి.
విక్కీతో పెళ్లి తర్వాత కత్రినా కొత్త సినిమాలను ఒప్పుకోవడం ఆపేసారు. ఆమె చివరిగా నటించిన సినిమా మెర్రీ క్రిస్మస్. ఇందులో కత్రినా విజయ్ సేతుపతికి జంటగా నటించారు. 2024లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం కత్రినా తాను స్థాపించి కే బై కత్రినా అనే బ్యూటీ బ్రాండ్‌ను మార్కెటింగ్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు.