Karthika Somavaram Special: కార్తీక మాసం అంత పవిత్రమైన మాసం ఇంకొకటి లేదు. ఆ మాసమే అంత గొప్పదైతే అందులో వచ్చే ఒక్కో సోమవారం శక్తి మాటల్లో చెప్పలేం. కార్తీక సోమవారం పరమ పవిత్రమైనది. దాని గురించి పురాణాల్లో చెప్తూ ఒక మాటన్నారు. ఎవరైతే కార్తీక సోమవారాల్లో వ్రతం చేస్తారో వాళ్ల పాపరాశంతా అగ్నిలో పడేసిన దూదిలాగా దగ్ధమైపోతుందని మన పురాణాల్లో ఉంది. ఇంతకీ సోమవారం వ్రతం ఎలా చేయాలి అంటే.. అదేం పెద్ద కష్టం కాదు. మొట్టమొదటిది.. నదీ స్నానం. సోమవారం రోజు మీ ఇంటి దగ్గర్లో నది ఉన్నా.. ఇంటికి కాస్త దూరంలో ఉన్నా ఫర్వాలేదు. తప్పకుండా నదీ స్నానం చేయండి. మన దగ్గర నదులు లేవనుకోండి.. ఇంట్లోనే చేయచ్చు.
శివుడికి లాభమేమీ లేదు
రెండోది ఏంటంటే.. ఆరోజు పరమేశ్వరుడికి తప్పకుండా బిల్వ పత్రాలతో అర్చన, అభిషేకం చేయాలి. ఆ తర్వాత ఆరోజంతా పగలు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రాలను చూసాక భోజనం చేయాలి. అప్పటివరకు ఆగలేని వాళ్లని ఛాయానక్తం అంటారు. అంటే సాయంత్రం 4:30 గంటలకు భోజనం చేయచ్చు అని శాస్త్రంలో చెప్పిన ఒక ప్రత్యామ్నాయం. ఈ విషయంలో గుర్తుపెట్టుకోండి. ఉపవాసాలు చేసి ఆరోగ్యం మీదకు తెచ్చుకోకండి. పురణాల్లో చెప్పిన ఉపవాసాలు చాలా వరకు మన ఆరోగ్యాన్ని బాగుచేసేందుకు చెప్పినవే.
వారంలో ఒక రోజు ఉపవాసం ఉంటే ఆరోగ్యానికి మంచిదని అలా చెప్పారు. అంతేకానీ.. మీరు ఉపవాసం చేసినంత మాత్రాన శివుడికి కలిగే లాభం ఏమీ ఉండదు అనే ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. కొందరు కార్తీక మాసం వచ్చేసింది కదా అని శివయ్యను మెప్పించాలని కటిక ఉపవాసాలు చేస్తుంటారు. భక్తితో చేయగలిగితే ఫర్వాలేదు. అంతేకానీ బలవంతంగా ఆకలిని చంపుకుని.. రాత్రి ఎప్పుడు అవుతుందా ఎప్పుడు నక్షత్రాలను చూస్తామా అనే ధ్యాసతో ఉంటారు చాలా మంది. అలా చేస్తే ఉపవాస ఫలితం ఏమీ ఉండదు.
అసలు ఉపవాసం అంటే ఏంటి?
Karthika Somavaram Special: సంకల్పంతో చేపట్టే వ్రతాన్ని సంకల్ప ఉపవాసం లేదా పవిత్ర ఉపవాసం అంటారు. దీనిని మన భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన ఆచారాలలో ఒకటిగా పరిగణిస్తాం. ఈ ఉపవాసానికి ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రాచీన కాలం నుంచి నేటి వరకు ఇది హిందూ, జైన, బౌద్ధ వంటి పలు మతాల సంప్రదాయంలో ఉంది. ఉపవాసం ఆచరించే సమయంలో శరీరం శుద్ధి అవుతుంది. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా ఉపవాసం చేస్తే భగవంతుని పట్ల భక్తి, మనోనిబ్బరాన్ని పెంచుతుందని విశ్వసిస్తారు.
కార్తీక, శ్రావణ, చైత్ర మాసాలలో ఈ ఉపవాసాలకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఉదాహరణకు.. కార్తీక మాసంలో ఉపవాసం చేస్తే అది పాపాలను కడిగేస్తుందని మన పురాణాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఈ ఉపవాసంలో వివిధ రకాల ఆహార నియమాలు పాటిస్తారు. సాధారణంగా చేసే ఉపవాసాల్లో పండ్లు, నీళ్లు మాత్రమే సేవిస్తారు. అంతేకాకుండా…. ఉపవాస సమయంలో జపం, ధ్యానం, దైవ ప్రార్థనలు చేయడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. సంకల్ప ఉపవాసం ద్వారా సత్కార్యాలు, భక్తి భావం, ఆత్మానందం పొందగలుగుతాం. ఈ రకంగా ఉపవాసం చేయగలిగితే ఎంతో పుణ్యం. చేయలేనివారు శివ నామం స్మరిస్తూ ఉంటే సరిపోతుంది. అయితే ఉపవాసం చేయలేని వారు ఎవరో ఒకరిని ఇంటికి పిలిచి కడుపు నిండా భోజనం పెట్టండి. శివయ్యే మీ ఇంటికి భోజనానికి వచ్చినట్లుగా భావించండి సరిపోతుంది.
రాత్రి పరమేశ్వరుడికి సంబంధించిన ఏదో ఒక లీల చదివాలి. దీనిని మరుసటి రోజు తెల్లవారుజామున స్నానం చేసి ఎవరికైనా ఏదో ఒకటి దానం చేయండి. లేకపోతే ఎవరికైనా తృప్తిగా భోజనం పెట్టండి. క్లుప్తంగా చెప్పాలంటే ఇదే సోమవారం వ్రతం. ఇలా కార్తీక మాసంలో వచ్చే సోమవారాలన్నీ చేయండి. కొన్ని సార్లు నాలుగు సోమవారాలు.. మరికొన్ని సార్లు ఐదు సోమవారాలు వస్తాయి. ఈసారి మాత్రం మనకు నాలుగు సోమవారాలే వచ్చాయి. ఈ నెలలో 4, 11, 18, 25 తేదీలు కార్తీక సోమవారాలు. దీని ప్రకారం ఇలా వ్రతం చేసుకోండి. అద్భుతమైన ఫలితం వస్తుంది.
ఏం ఫలితం వస్తుంది?
దీని గురించి మనకున్న పురాణాల్లోని స్కాంద పురాణంలో ఓ కథ చెప్పారు. పూర్వ కాలంలో ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి ఓ కూతురు పుట్టింది. ఆ తండ్రి విపరీతమైన గారాబం చేసేసి నా బంగారం నా బంగారం అని పెంచుతాడు. బిడ్డకు కాస్త వయసు వచ్చేసరికి పర పురుష వ్యామోహంలో పడిపోయింది. అప్పుడు తండ్రి నాలుగు చీవాట్లు పెట్టి దారిలో పెట్టాలి. కానీ ఆ తండ్రి అలా చేయలేదు. ఎందుకంటే కూతురంటే పిచ్చి. తిడితే ఎక్కడ అమ్మాయి అలుగుతుందో అని చెప్పి.. పర పురుషుడితో కలిసి తిరుగుతున్నా ఏమీ అనడు. చివరికి మిత్ర శర్మ అనే బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అతని తల్లి దండ్రులు చాలా జపతపనిష్ఠాగరిష్ఠులు. అలా కూతురిని వదిలించుకుంటాడు. మిత్ర శర్మ అమాయకుడే కానీ అతనికి ఏకైక బలహీనత ఏంటంటే.. భార్యా సంగమం లేకపోతే బతకలేడు. అందువల్ల ఆ భార్య ఎన్ని తప్పులు చేసినా మందలించకుండా రాత్రయ్యే సరికి ఆ తప్పులన్నీ క్షమించేసేవాడు. తండ్రి చాత కాని వాడు భర్తా చాతకాని వాడే.
దాంతో ఇంకేం చేసినా యవ్వన గర్వంతో అత్తామామలను హింస పెట్టేసి.. పరాయి పురుషులతో తిరిగి.. వారు తెచ్చి ఇచ్చిన వస్తువులను వాడుకునేది. ఇలాగ ఏ స్త్రీ అయినా మారకపోతే వారిని త్యజించమని శాస్త్రం చెప్పింది. దాంతో అత్తామామలు చాలా సార్లు మందలించారు. ఇలాంటి వారిని త్యజిస్తే ఆ ఇల్లు నిలబడుతుంది. లేకపోతే ఏదో ఒక రోజు ఆ ఇంటికే ప్రమాదకరం. మిత్ర శర్మకు ఒక వ్యామోహం భార్యంటే. దాంతో అతను త్యజించలేకపోతాడు. చివరికి అత్తామామలు.. అమ్మో ఈ అమ్మాయిని భరించలేమని చెప్పి ఇంట్లో నుంచి బయటికి పంపించి వేరే కాపురం పెట్టించారు. వేరే కాపురం పెట్టించినా కూడా ఆ అమ్మాయి మారదు. పైగా మరింత దిగజారిపోయి ప్రవర్తిస్తూ ఉండేది.
కానీ భర్త మాత్రం చెప్పేవాడు కాదు. తనతో కలిసి ఉంటే చాలు ఎలా తిరిగినా ఫర్వాలేదు అనుకునేవాడు. ఇక చివరికి పక్క వారికి అసహ్యమేసి కర్కశ అని పేరు పెట్టి పిలవడం మొదలుపెట్టారు. చివరికి.. వీళ్లతో వాళ్లతో సుఖిస్తుంటే వారు మన సుఖానికి అడ్డొస్తున్నాడు. ఒక పని చెయ్యి. విషం పెట్టి చంపేయ్. లేకపోతే ఏదో ఒకరకంగా చంపేసి మనం హాయిగా ఉండచ్చు అని చెప్తారు. అది తలకెక్కేసి.. భర్త నిద్రపోతుండగా పెద్ద బండరాయి తెచ్చి అతని తలపై మోది చంపేస్తుంది. ప్రియుల సాయంతో ఆ శవాన్ని బావిలో పడేస్తుంది. ఇక అత్తామామలు కూడా ఊరు వదిలేసి వెళ్లిపోయారు. ఇంకేముంది.. యధేచ్ఛగా విచ్చలవిడిగా కంటికి కనిపించిన మగవాడితో తిరగడం మొదలుపెట్టింది. అలా ఒక 50 ఏళ్లు దాటాయి. 50 ఏళ్లు దాటే సరికి ఇక యవ్వనమంతా పోతుంది కదా..! మామూలుగా కొంచెమైనా పశ్చాత్తాపం ఉన్నా 50 దాటాక కనీసం బాధపడతారు. అయ్యో ఇంతకాలం తప్పులు చేసాను అత్తామామలను హింసించాను భర్తను చంపాను అని కనీసం బాధపడతారు. కానీ అది కూడా ఆమెలో ఇసుమంతైనా లేదు. పైగా వీళ్లింటికి వాళ్లింటికి వెళ్లి గొడవలు పెట్టి భార్యాభర్తలను విడదీసేది. కాపురాలు కూల్చేది.
అలా వృద్ధాప్యం వచ్చేసింది. అదృష్టం ఏంటంటే.. ఆమెకు సంతానం లేదు. సాధారణంగా ఇంత ఘోరమైన తప్పులు తల్లిదండ్రులు చేస్తే అవి వారి పిల్లలను కట్టి కుడిపేస్తాయి. పిల్లలు లేకపోతే ఇలాంటి తప్పులు చేసినవారిని ఒకే ఇంట్లో పుట్టించి మరీ ఫలితం అనుభవించేలా కర్మ తన పని తాను చేసుకుపోతుంది. కాకపోతే ఈ అమ్మాయి అదృష్టం పిల్లలు లేరు. ఇక వృద్ధాప్యం వచ్చాక చేసిన పాపాలకు విటులతో తిరిగినందుకు వ్యాధులు వచ్చి ఒళ్లంతా వ్యాధితో భయంకరమైన రోగాలతో మంచాన పడింది. చుట్టుపక్కల వాళ్లు కూడా అసహ్యించుకోవడం మొదలుపెట్టారు.
చివరికి ఒక రోజు దిక్కులేని చావు చచ్చింది. అప్పుడు యమభటులు వచ్చి తీసుకెళ్లి నరకంలో కొన్ని వేల సంవత్సరాల పాటు అగ్ని సాక్షిగా వివాహం చేసుకుని బయటవాళ్లతో సుఖించినందుకు గానూ.. ఒక ఎర్రగా కాల్చిన స్తంభాన్ని కౌగిలించుకోమని చెప్పి కొరడాలతో కొట్టారు. భర్తను బండరాయితో కొట్టి చంపేసినందుకు ఇనుమ గదలతో చితక్కొట్టారు. చుట్టుపక్కల వాళ్లందరి మీద లేనిపోనివి కల్పించి చెప్పినందుకు సల సల కాగే నూనెలో పడేసారు. అత్తామామలకు అపకీర్తి తెచ్చినందుకు వాతలు పెట్టారు.
చివరకు కుంభీపాక నరకంలో ఎన్నాళ్లో ఉంచి కిందికి పంపిస్తే 15 సార్లు శునక జన్మ ఎత్తింది. ఇవన్నీ పురాణాల్లో ఎందుకు చెప్పారంటే.. ఇలాంటి తప్పులు ఏవైనా చేసేటప్పుడు చాలా సరదాగా ఉంటాయి. పశ్చాత్తాపం ఉండదు. తర్వాత కర్మ అనుభవించినప్పుడు బాధ మాటల్లో చెప్పలేం. ఆఖరికి 15వ సారి శునక జన్మ ఎత్తినప్పుడు తన అదృష్టం బాగుండి.. ఒకసారి కార్తీక మాసంలో ఇంటింటా తిరుగుతుంటే ఛీ కుక్కా అంటూ కర్రతో కొట్టి పంపించేసారు. ఒకరోజు ఒక వ్యక్తి కార్తీక సోమవారం వ్రతం చేస్తుంటే.. సాయంత్రం నక్షత్రాలను చూసాక భోజనం చేద్దామని చెప్పి ప్రసాదం బయట పెట్టుకుని ఇంట్లోకి వెళ్లాడు. వెంటనే కుక్క జన్మ ఎత్తిన ఆ అమ్మాయి దానిని ముట్టుకుంది. కార్తీక మాసంలో కార్తీక సోమవారం వ్రతం చేసి నైవేధ్యం పెట్టినది దానికి ఎంత శక్తి ఉంటుందో తెలుసా? వెంటనే ఆ కుక్కకి పూర్వ జన్మ స్మృతితో పాటు మనిషిలా మాట్లాడే శక్తి వచ్చాయి. వెంటనే అది ఏడుస్తూ బ్రాహ్మణోత్తమా నన్ను కాపాడు అని అరిచింది. అప్పుడు ఆ వ్యక్తి ఎవరబ్బా అని వెంటనే బయటికి వచ్చి చూడగా.. కుక్క మాట్లాడుతోంది. అది చూసి ఆయన ఆశ్చర్యపోయాడు.
ఆ శక్తి ఎందుకొచ్చిందంటే ఆ పాపం కరిగింది. ఏదో ఒక రకంగా పైకి వెళ్లే అదృష్టం వచ్చింది. ఎవరమ్మా నువ్వు అని ఆ వ్యక్తి అడగ్గా.. కొన్ని జన్మల క్రితం ఒక బ్రాహ్మణుడి ఇంట్లో పడినా సరే ఆ గొప్పతనం గ్రహించకుండా వ్యభిచారిగా మారి ఆ పాపానికి చివరికి నరకానికి పోయాను. ఇన్ని జన్మలు కుక్క కింద పుట్టాను. ఈరోజు మీరు చేసిన ప్రసాదం వల్ల నాకు ఈ శక్తి కలిగింది. దయచేసి నన్ను ఉద్ధరించే పని ఏదైనా చేయండి అని వేడుకుంది. అప్పుడు ఆయన సరేనమ్మా.. ఈరోజు సోమవారం వ్రతం చేస్తున్నాను కదా పుణ్యం మొత్తం నీకు ధారపోస్తున్నాను అంటూ చేతిలో నీళ్లు తీసుకుని నేను చేసిన పుణ్యం ఏదైనా ఉంటే ఈ కుక్కకు కలగాలి అని చెప్పాడు. వెంటనే కుక్క ఒక స్త్రీ రూపం ధరించింది. శివ ధూతలు విమానం తీసుకొస్తే అది ఎక్కి కైలాసానికి వెళ్లిపోయింది. ఆ అదృష్టం ఉంది కాబట్టే పరమేశ్వరుడు ఆ వాక్కు ఇచ్చాడన్నామట. ఇది కథ. కార్తీక సోమవారం రోజు చేసిన వ్రతానికి ఎంత శక్తి ఉందో తెలిసింది కదూ..!