Jalgaon Train Accident: కొన్ని సార్లు తెలిసో తెలీకో మనం చేసే పనులు కొన్ని ఘోరాలకు దారి తీస్తాయని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. మంచికి పోతే చెడు ఎదురైందని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. రైల్లో మంటలు వస్తున్నాయని ఓ చాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రయాణికులకు ఈ విషయాన్ని చెప్పి చైన్ లాగాడు. దాంతో రైలు ఆగగానే చాలా మంది ప్రయాణికులు రైలు నుంచి దిగేసారు. కానీ పాపం వారికి తెలీని విషయం ఏంటంటే.. పక్కనే మరో రైలు వేగంగా దూసుకొస్తోంది. దాంతో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 13 మంది దుర్మరణం చెందారు. మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో నిన్న జరిగిన పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం సంచలనంగా మారింది.
రైలు పట్టాల రాపిడి వల్ల మంటలు వస్తున్నాయని లోకో పైలట్ అనడంతో అక్కడే చాయ్ అమ్ముకుంటున్న వ్యక్తి ఆ మాట విని అందరినీ అప్రమత్తం చేసేందుకు యత్నించాడు. కనీసం ఏం జరిగింది.. రైలు ఆపాలా వద్దా అని కూడా అడగకుండానే చైన్ లాగేసాడు. దాంతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు రైలు నుంచి దిగేసారు. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న వివరాలను బట్టి చూస్తే.. ఎక్కడా కూడా మంటలు వ్యాపించడం.. నిప్పు రాజుకోవడం వంటివి జరగలేదని.. చాయ్ వాలానే తప్పుడు ప్రచారం చేసి చైన్ లాగాడని అంటున్నారు. 13 మంది రైలు ఢీకొని దుర్మరణం చెందారంటే అందుకు కారణం ఆ చాయ్ వాలానే అని అతన్ని అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. (Jalgaon Train Accident)
చనిపోయిన 13 మంది పక్కనే ఉన్న రైల్వే ట్రాక్‌పైకి నేరుగా దూకేయడంతో అక్కడి నుంచి వస్తున్న కర్ణాటక ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొంది. మిగతా వందలాది మంది ట్రాక్ లేని చోట దూకడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. లేదంటే వందలాది మంది మృత్యువాతపడేవారు. ఈ దారుణ ఘటన పట్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేసారు. మోదీ చనిపోయిన వారి కుటుంబాలకు రూ.1.5 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు స్వల్పంగా గాయపడిన వారికి రూ.5000, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50000 పరిహారం చెల్లించారు. సీఎం ఫడణవీస్ మాత్రం చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అసలు ఆ చాయ్ అమ్ముకునే వ్యక్తికి అగ్ని ప్రమాదం గురించి ఎవ్వరూ చెప్పలేదని అంటున్నారు. అసలు అగ్ని ప్రమాదం లాంటిదే జరగలేదు అంటున్నారు. మరి ఆ వ్యక్తి మంటలు వ్యాపిస్తున్నాయంట అంటూ చైన్ ఎందుకు లాగినట్లు? ఈ కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆ చాయ్ వాలా రైలులోనే ఉన్నాడా? లేక తన వల్ల ఈ ఘోరం జరిగిందని తప్పించుకున్నాడా అనేది కూడా తెలియాల్సి ఉంది.