Jagan: సింహాచలం గోడ కూలిన ఘటనలో ఎనిమిది మంది భక్తులు చనిపోయిన నేపథ్యంలో ప్రస్తుత అధికారం కేవలం రూ.25 లక్షలు మాత్రమే పరిహారం చెల్లించిందని.. మళ్లీ తాను అధికారంలోకి వచ్చాక రూ.1 కోటి వరకు పరిహారం ఇప్పిస్తానని మాటిచ్చారు YSRCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. నిన్న ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక చాలా బాధాకార ఘటనలు జరిగాయని.. తప్పు ఒప్పుకోకుండా పైగా గత పాలకుల కారణంగానే జరిగిందని నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
బేసిక్ సెన్స్ లేకుండా గోడని నిర్మించి.. ఏడుగురిని బలిగొన్న చంద్రబాబు సర్కార్ అంటూ మండిపడ్డారు. కాంక్రీట్‌తో కట్టాల్సిన గోడను ప్లైయాష్ ఇటుకలతో కడతారా? అది కూడా నాణ్యత లేకుండా నాలుగు రోజుల్లోనే హడావుడిగా నిర్మాణం.. సింహాచలం చందనోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా కనీస జాగ్రత్తలు తీసుకోరా? అని ప్రశ్నించారు.
తిరుమల చరిత్రలోనే ఎప్పుడూ జరగని సంఘటన చంద్రబాబు వచ్చాక జరిగిందంటే ఆయన పాదం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు జరిగితే దాదాపు రూ.1 కోటి వరకు పరిహారం చెల్లించేవాడినని.. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదని.. తర్వాత ఎటూ వచ్చేది తన ప్రభుత్వమే కాబట్టి ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన రూ.25 లక్షలు కాకుండా మిగతా పరిహారం కూడా ఇప్పించే బాధ్యత తనది అని ఈ సందర్భంగా మాటిచ్చారు.