PAN Card: ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కొత్త అలెర్ట్ జారీ చేసింది. సాధారణంగా బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతి పౌరుడికి ఒక్క ప్యాన్ కార్డు మాత్రమే ఉండాలి. అలా కాకుండా రెండు వాడుతుంటే మాత్రం ఇన్‌కమ్ ట్యాక్స్ రూ.10 వేలు జరిమానా విధిస్తుంది. అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే.. కొంత మంది రెండు ప్యాన్ కార్డులు ఉండకూడదు అని తెలీక రెండో ప్యాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారట. దరఖాస్తు చేసుకున్నా బ్యాంకులు గుడ్డిగా ఇవ్వవనుకోండి.
కానీ దరఖాస్తు చేసుకున్నాక రాకపోయినా.. దరఖాస్తు చేసుకోవడం కూడా తప్పే అని ఇన్‌కమ్ ట్యాక్స్ భావిస్తోంది. ఇలాంటి వారిపై గట్టి నిఘా వేసి ఉంచుతోంది. అసలు ఎందుకు రెండో ప్యాన్ కార్డు కోసం అప్లై చేస్తున్నారు వంటి వివరాలను సేకరిస్తోంది. ఒకవేళ ప్యాన్ కార్డు పోయినా.. అదే నెంబర్‌తో ఇంకోటి జారీ చేసే అవకాశం ఉంది. కానీ కార్డు పోయిందన్న సాకుతో ఒకటికి మించి ప్యాన్ కార్డులకు అప్లై చేస్తే చిక్కుల్లో పడతారు.
ఒకవేళ కొత్తగా జారీ చేయబడిన ప్యాన్ కార్డులో మీ వివరాలు తప్పుగా ప్రింట్ అయ్యుంటే వెంటనే బ్యాంకును సంప్రదించాలి. అది మానేసి కొత్త ప్యాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా రూ.10 వేలు జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. వివాహం తర్వాత స్త్రీల ఇంటి పేరు మారుతుంది. ఒకవేళ వారి అత్తింటి పేరు ప్యాన్ కార్డులో ఉండాలనుకున్నా కూడా బ్యాంకును సంప్రదించాల్సిందే. ఈ సాకుతో రెండో ప్యాన్ కార్డు కోసం అప్లై చేసారో.. అంతే సంగతులు!