War 2: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (JR Ntr) వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటిస్తున్నారు. తారక్‌ది విలన్ పాత్ర అంటున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కియారా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే.. ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య ఓ సాంగ్ ఉండబోతోందట. ఇందులో ఇద్దరూ తమ స్టెప్పులతో ఇరగదీయనున్నారన్న టాక్ వస్తోంది. దాంతో ఫ్యాన్స్ తెగ ఖుష్ అయిపోతున్నారు. ఎందుకంటే బాలీవుడ్‌లో హృతిక్ రోషన్‌లా డ్యాన్స్ చేసేవారు లేరు. ఎంతటి కఠినమైన డ్యాన్స్ అయినా చాలా సునాయాసంగా చేసేస్తారు హృతిక్. ఇక మన ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తారక్‌తో డ్యాన్స్ అంటే హృతికే భయపడిపోతున్నాడట. తారక్‌తో కలిసి వార్ 2లో ఓ పాటకు డ్యాన్స్ చేయబోతున్నానని.. తనతో డ్యాన్స్ తర్వాత తన కాళ్లు స్ట్రాంగ్‌గా ఉంటే అంతే చాలని హృతిక్ అంటున్నారు.
గతంలో ధూమ్ 2 అనే సినిమాలో పాటలు, సినిమా కథ ఓ రేంజ్‌లో క్లిక్ అయ్యింది. ధూమ్ ఫ్రాంచైస్‌లో ధూమ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో హృతిక్ రోషన్ వేసిన స్టెప్పులకు ఇప్పటికీ క్రేజ్ ఉంది. మరి ధూమ్ 2 నచ్చిందా లేదా వార్ 2నా అని హృతిక్‌ను అడగ్గా.. ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే అంటూ వార్ 2 అనేసారు. ఎందుకు అని అడగ్గా.. ఇందులో తాను ఎన్టీఆర్‌తో కలిసి డ్యాన్స్ చేయబోతున్నానని తెలిపారు. ధూమ్, వార్ సినిమాలు రెండూ భారతదేశంలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థ అయిన యష్ రాజ్ ఫిలింస్‌కి చెందినవే. ధూమ్ లాగే వార్‌ని కూడా ఓ ఫ్రాంచైస్‌లా తీయబోతున్నారు.