Heart Attack In Women: గుండెనొప్పిని ఇప్పటికీ మెన్స్ డిసీజ్‌గా (Mens Disease) చూస్తున్నారు. అంటే కేవలం మగవారికి మాత్రమే గుండె జబ్బులు, గుండెపోటు వస్తుందని అనుకోవడం. ఇది అపోహ. చెప్పాలంటే.. మగవారిలో వచ్చే గుండెపోటు కంటే ఆడవారిలో వచ్చే గుండెపోటు చాలా ప్రమాదకరమైనది. మగవారిలో గుండెపోటు వస్తే స్టెంట్స్ వేయడం, బైపాస్ సర్జరీలు చేయడం వంటివి చేస్తే కొన్నేళ్ల పాటు బతికే ఛాన్స్‌లు ఉన్నాయి. కానీ ఆడవారిలో చాలా మటుకు అలా ఉండదు. ఒకసారి గుండెపోటు వస్తే ప్రాణాలు పోయే ప్రమాదం చాలా ఎక్కువ.
మెన్స్ డిసీజ్ అని ఎందుకంటారు?
ఇది ఇప్పటి మాట కాదులెండి. ఎప్పటి నుంచో గుండెపోటుని మెన్స్ డిసీజ్‌గా చూస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. మగవారు ఎక్కువగా ధూమపానం, మద్యపానం చేస్తుంటారు కాబట్టి వారిని గుండెపోటు, గుండె సంబంధిత ఇబ్బందులు వస్తాయని అనుకుంటారు. ఇది నిజమే. కానీ ఇక్కడ మరో కీలక పాయింట్ ఏంటంటే.. ఆడవారిలో ఈస్ట్రోజెన్ అనే కీలకమైన హార్మోన్ ఉంటుంది. ఇది ఆడవారి గుండెకు రక్షక కవచంలా ఉంటుంది. ఈస్ట్రోజన్ ఎప్పుడైతే సమృద్ధిగా, సమపాళ్లలో ఉంటుందో వారిలో అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు చాలా తక్కువనే చెప్పాలి. ఈ ఈస్ట్రోజన్ అనేది 40 దాటాక తగ్గుతూ ఉంటుంది. సరిగ్గా అదే వయసులో మెనోపాజ్ దశలు మొదలవుతుంటాయి. ఇక అక్కడి నుంచి అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.
ఆడవారిలో గుండెపోటు
మహిళల్లో గుండెపోటు చాలా ప్రమాదకరమైనది. ఇందాక చెప్పినట్లు ఇది మెన్స్ డిసీజ్ కాదు. మగవారితో పోలిస్తే ఆడవాళ్లలోనే గుండెపోటు మరణాలు అత్యధికంగా ఉన్నాయి. అయితే మగవారితో పోలిస్తే ఆడవారికి గుండె సమస్యల విషయంలో కనిపించే లక్షణాలు కాస్త వేరుగా ఉంటాయి. ఉదాహరణకు.. ఆడవారిలో వక్షోజాల నొప్పి కూడా ఇంచు మించు ఛాతీ నొప్పిలాగే అనిపిస్తుంటుంది. అందుకే.. ఛాతీ నొప్పి వస్తోంది అని ఆడవాళ్లు గైనకాలజిస్ట్‌ల దగ్గరికి వెళ్తే ముందు వారికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందేమో అనే అనుమానంతో పలు పరీక్షలు చేస్తుంటారు.
ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?
ఇక్కడ అసలు సమస్య ఏంటంటే.. మగవారిలో కాస్త అలసట అనిపించినా.. బాగా చెమటలు పట్టేస్తున్నా గుండె సంబంధిత వ్యాధేమో అని ప్రత్యేకంగా గుండెకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తుంటారు. కానీ ఆడవారి విషయంలో అలా కాదు. వాళ్లకి విపరీతంగా చెమటలు పట్టడం, వాంతులు, నీరసం ఇవన్నీ ఉన్నా మెన్సెస్ వల్లో లేక విటమిన్ల లోపం వల్లో అని పొరబడుతుంటారు. దాంతో ఇది సాధారణమేలే అని పరీక్షలు చేయించుకోకుండా వదిలేస్తుంటారు. దాంతో సమస్య తీవ్రత పెరిగి రియలైజ్ అయ్యేలోపే ప్రాణాల మీదకు వచ్చేస్తుంది.
పూడికలు కనిపించకపోవడం..
గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడితే గుండెపోటు వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ పూడికలు మగవారిలో క్లియర్‌గా కనిపిస్తుంటాయి కానీ.. ఆడవారిలో అంత క్లియర్‌గా కనిపించవు. ఇందుకు కారణం ఏంటంటే.. గుండె సమస్యలను కనిపెట్టే పరికరాలను మగవారి గుండె పనితీరును నిర్దేశించే రీతిలో కనిపెట్టారు. దాంతో అవి మహిళల గుండె పనితీరుని, సమస్యని సరిగ్గా గుర్తించలేవు. దీని వల్ల ఏమవుతుందంటే.. రక్తనాళాల్లో పూడికలు కనిపించడం లేదు.. బహుశా గుండె బాగానే ఉందేమో అనే నిర్ణయానికి వచ్చేస్తుంటారు.
చికిత్సలూ కష్టమే
మగవారితో పోలిస్తే ఆడవారికి ఒత్తిడి, డిప్రెషన్ కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కానీ ఆడవారిలో ఇవి కామనే అనుకోవడం వల్ల గుండె సమస్యలను గుర్తించడం కష్టంగా మారుతోంది. ఇక మహిళలు మెనోపాజ్ దశకు రాగానే గుండె సమస్యలు మరింత పెరుగుతాయి. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గుండెను అప్పటివరకు రక్షిస్తున్న ఈస్ట్రోజన్ లెవెల్స్ పడిపోతుంటాయి. గుండెపోటు వచ్చి మహిళలు పడిపోయినప్పుడు వారికి సమయానికి చికిత్స అందకపోవడం, CPR వంటివి చేయలేకపోవడం.. హాస్పిటల్స్‌కు తీసుకెళ్లినా స్టెంట్లు వేయడం కష్టతరంగా మారడం వల్ల మరణశాతం ఎక్కువగా ఉంటోంది.