Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన గేమ్ ఛేంజర్ సినిమా టికెట్లను ఉచితంగా ఇచ్చేస్తున్నారా? హిందీ రాష్ట్రాల్లో పరిస్థితి అలాగే ఉందని టాక్ వినిపిస్తోంది. మొన్న శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమాకి మిక్స్‌డ్ రివ్యూలే వచ్చాయని చెప్పాలి. కొందరేమో బూతు సినిమాలను ఆదరిస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి లాజిక్‌తో కూడుకున్న సినిమాలు ఎక్కవండీ.. అందుకే బాలేదని చెప్తున్నారు అని అంటున్నారు. మరికొందరేమో.. సినిమాలో రామ్ చరణ్ ఏకంగా మూడు నాలుగు క్యారెక్టర్లలో కనిపిస్తాడని.. ఒక వ్యక్తిని అన్ని క్యారెక్టర్లలో చూపించడంలో లాజిక్ ఎక్కడుందని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో సినిమా బాగానే ఆడుతోంది. కానీ హిందీ ప్రాంతాల్లోనే కాస్త సినిమా టికెట్ ధరలు తగ్గాయి. ఇందుకోసమే ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో టికెట్లు ఉచితంగా ఇచ్చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి హిందీ ప్రాంతాల్లో వచ్చిన కలెక్షన్లు రూ.21 కోట్లు. ఈ విషయాన్ని బాలీవుడ్ బాక్సాఫీస్ ట్రాకర్‌గా పేరుగాంచిన బ్లాక్ బుకింగ్స్ సంస్థ వెల్లడించింది.
అయితే నిన్న రాత్రి ఓ విచిత్రం చోటుచేసుకుందట. డీల్స్ గురించి సోషల్ మీడియాలో ప్రమోట్ చేసే ఓ ఎకౌంట్ ప్రకటించిన వివరాల ప్రకారం టికెటింగ్ వెబ్‌సైట్‌కి సంబంధించిన కోడ్స్ బయటికి వచ్చాయట. ఈ కోడ్‌ని గేమ్ ఛేంజర్ సినిమా టికెట్లు బుక్ చేసుకుంటున్న సమయంలో వాడితే టికెట్లు ఉచితంగా వస్తాయని అన్నారు. కేవలం బుకింగ్ చేసుకున్నందుకు, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ రుసుంను మాత్రమే ఆ బుకింగ్ సంస్థ తీసుకుంటుందట. ఉదాహరణకు ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఐనాక్స్ థియేటర్ ఉంది. అక్కడ గేమ్ ఛేంజర్ టికెట్ ధర రూ. 610. ఇద్దరికి కలిపి టికెట్ బుక్ చేస్తే రూ. 1,220 పడుతుంది. కానీ ఆ కోడ్‌ను కాపీ చేస్తే కేవలం రూ.142 తీసుకుని టికెట్లు ఇచ్చేస్తారు. ఈ కోడ్స్ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, కేరళలో మాత్రం వర్తించవట. ఈ కోడ్‌తో బుకింగ్ చేసుకోవాలంటే కేవలం ఆదివారం రోజే చేసుకోవాలట. మిగతా రోజుల్లో సాధారణ టికెట్ ధరలే వర్తిస్తాయి. (Game Changer)
సాధారణంగా కొన్ని టికెట్ బుకింగ్ పోర్టల్స్ డిస్కౌంట్లు ఇవ్వడం చూస్తుంటాం కానీ ఇలా మరీ టికెట్లు ఉచితంగా ఇచ్చేయడం ఇదే తొలిసారి అంటున్నారు. అందులోనూ రామ్ చరణ్ సినిమాకు ఇలా ఉచితంగా టికెట్లు ఇచ్చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఊహించిన స్థాయిలో సినిమా కలెక్షన్లు రావడం లేదని అందుకే ఈ జిమ్మిక్‌తో వసూళ్లు పెంచాలని చూస్తున్నారని కూడా ఓ వర్గం అంటోంది. ఇకపోతే.. గేమ్ ఛేంజర్ సినిమా పైరసీ కాపీ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొందరు ఈ కాపీని రిలీజ్ చేసేసారంటూ రామ్ చరణ్ అభిమానులు కొందరు సైబర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసారు.