China Deep Sea Radar Threat: అగ్రరాజ్యం అమెరికాకి చైనా షాకిచ్చింది. చైనాకి చెందిన మిలిటరీ చర్యలు, సైన్యంలో చేపడుతున్న మార్పులు, నౌకాదళ శిక్షణకు సంబంధించి అమెరికా ఎప్పటికప్పుడు స్పై విమానాల ద్వారా గూఢచర్యానికి పాల్పడుతూ ఉంటుంది. ఈ విషయం చైనాకి కూడా తెలుసు. అందుకే చైనాకి ఈ విషయంలో అమెరికా అంటే ఒళ్లుమంట. మేమేం చేసుకుంటే మీకెందుకయ్యా.. అనే ధోరణిలోనే ఎప్పుడూ చైనా ఉంటుంది. మీపై మాకు నమ్మకం లేదు దొరా అని అమెరికా చైనాకు ధీటుగా బదులిస్తూ ఉంటుంది.
ఇప్పటివరకు అమెరికా చైనాపై గూఢచర్యం చేయడానికి U-2, RC-135 విమానాలను వాడుతుంటుంది. ఈ విమానాలు సాధారణమైనవి కావు. అత్యంత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో తయారుచేసినవి. ఈ విమానాల ద్వారా ఎప్పుడు చైనాపై అమెరికా గూఢచర్యానికి పాల్పడినా చైనాకు తెలిసేది కాదు. ఎందుకంటే ఈ విమానాలు చైనా రాడార్లకు చిక్కవు. చైనా రాడార్లకు దొరక్కుండా ఈ విమానాలు 70 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంటాయి. సాధారణ విమానాలు అంత ఎత్తులో ప్రయాణించవు. అందుకే మన కంటికి కనపడతాయి. కానీ ఈ విమానాలు రాడార్లకు కూడా చిక్కవు.
దాంతో ఈ విమానాలు చైనాకి పెద్ద తలనొప్పిగా మారాయి. మీరు విమానాలు పంపి మాపై గూఢచర్యం చేస్తున్నారు మా ఇంటెలిజెన్స్ వివరాలన్నీ తెలుసుకుంటున్నారు అని చైనా అమెరికాపై ఆరోపణలు చేసినప్పుడు.. మేం విమానాలు పంపామని ఆధారాలున్నాయా? అని అమెరికా ఎదురు ప్రశ్న వేసేది. చైనా రాడార్లకు కూడా అమెరికా విమానాలు చిక్కేవి కావు కాబట్టి పాపం చైనా మౌనంగా ఉండాల్సి వస్తోంది. కానీ ఇప్పుడు చైనాకి టైం వచ్చింది. అమెరికాకి గట్టి షాకిచ్చేలా డీప్ సీ రాడార్‌ను చైనా నిర్మించింది. China Deep Sea Radar Threat
డీప్ సీ రాడార్ అంటే?
చైనా శాస్త్రవేత్తలు ఈ డీప్ సీ రాడార్‌ను కనిపెట్టారు. ఇది ప్రపంచంలోనే తొలి డీప్ సీ రాడార్. ఈ రాడార్ ద్వారా స్పై విమానాలు ఎంత ఎత్తులో ఎగిరినా ఇట్టే దొరికిపోతాయి. అప్పుడు చైనా వాటిపై నిఘా ఉంచేందుకు ఈ రాడార్ సాయపడుతుంది. ఈ రాడార్ పేరు ఎకూస్టిక్ సెన్సార్ ఎర్రే రాడార్ (Acoustic Sensor Array Radar). ఈ రాడార్ దక్షిణ చైనా సముద్రంలో వెయ్యి మీటర్ల లోతులో నిర్మించారు. ఇది అమెరికా ఎంతటి బాబు లాంటి స్పై విమానాలను ప్రయోగించినా సులువుగా కనిపెట్టేస్తుంది. దాంతో డిఫెన్స్, టెక్నాలజీ అంశాల్లో అమెరికా చైనా కంటే వెనకే ఉందనే భావన ప్రజల్లో కలుగుతుందని అమెరికా బాధపడుతోంది. మిలిటరీ, ఆర్థిక అంశాల విషయంలో చైనా దూసుకెళ్తోంది. దాంతో అమెరికా ఈ విషయంలో చైనాను పోటీగా చూస్తోంది. ఎప్పటికప్పుడు చైనాకి చెందిన మిలిటరీ అంశాల గురించి తెలుసుకుంటూ ఉంటే తమ జాతీయ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండచ్చు అనేది అమెరికా భావన. ఇప్పుడు ఆ అవకాశం లేకుండాపోతోందనే బాధ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లో మొదలవుతోంది.