Bonda Uma తెలుగు దేశం పార్టీ నేత, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమ పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం అన్నది అప్పుడప్పుడు తెలుగు దేశం నేతలకు గుర్తుచేయాల్సి వస్తోంది. తెలుగు దేశం పార్టీ మాత్రమే అధికారంలో ఉంది అనుకుంటున్నారు కొందరు. ఆ కొందరిలో బోండా ఉమ ఉన్నారని నిన్న అసెంబ్లీ సమావేశాల్లో తేలిపోయింది.
నిన్న బోండా ఉమ అసెంబ్లీలో మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణ మండలి పనితీరుపై ప్రస్తావించారు. మండలి అధ్యక్షుడి దగ్గరికి వెళ్లి ఎమ్మెల్యేలు అడిగినా డిప్యూటీ సీఎం చెప్తే కానీ పని చేయలేం అంటున్నారని అన్నారు. స్థానికంగా ఉండే రాంకీ ఫార్మా నుంచి కాలుష్యం అంతా విశాఖ సముద్రంలో కలుస్తోంది కాలుష్య నియంత్రణ మండలి విజయవాడ సెంట్రల్‌లోనే ఉన్నప్పటికీ అక్కడ చెత్తా చెదారం మాత్రం అలాగే ఉంటోందని అన్నారు. ఆయన చెప్పిన దాంట్లో అన్నీ నిజాలే ఉండచ్చు. కానీ ఒక కూటమిలో కీలక నేతను, డిప్యూటీ సీఎంను అసెంబ్లీలో అందరి ముందు తీసి పారేసినట్లుగా మాట్లాడారంటూ ఆయనపై జనసేన నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై పవన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ వర్షాకాల సమావేశాలలో భాగంగా జరుగుతున్న ప్రశ్నోత్తరాల సమయంలో, విజయవాడ సెంట్రల్ శాసన సభ్యులు బోండా ఉమగారు కాలుష్య నియంత్రణ మండలి పనితీరుపై లేవనెత్తిన ప్రశ్నలకు, సుదీర్ఘంగా సమాధానం ఇస్తూ, కాలుష్య నియంత్రణ మండలి లో ఉన్న ఇబ్బందులను, సిబ్బంది కొరత, నిధుల సమస్యను వివరించిన ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం వైసీపీ కి సంబంధించిన వ్యక్తుల కంపెనీలను టార్గెట్ చేసేలా కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా కాలుష్య నియంత్రణను ఉల్లంఘించే ప్రతీ ఒక్కరిపై చర్యలు తీసుకునేలా, అదే సమయంలో ఈ చర్యల కారణంగా కార్మికులు ఇబ్బంది పడకుండా చూసేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అదే విధంగా సభ్యులు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉన్న ఇబ్బందులు అర్థం చేసుకోవాలని, త్వరలో పూర్తిస్థాయిలో బోర్డు సిబ్బంది కొరత పరిష్కరించడం ద్వారా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించేలా తానే పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.
దీనికి బోండా ఉమ స్పందిస్తూ.. అసెంబ్లీలో ప్రస్తావించిన సమస్యను విని తక్షణమే స్పందించి పరిష్కరించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు. ప్రజా సమస్యలపై ఇంత వేగంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం మీలో ఉన్న సేవా తపనకు నిదర్శనం. ఇలాంటి నాయకత్వం వల్లే ప్రజల్లో మీపై మరింత గౌరవం, విశ్వాసం, మంచి పేరు పెరుగుతోంది. అన్నారు. ఈ ట్వీట్ చూసిన కొందరు నెటిజన్లు బోండా ఉమపై సెటైర్లు వేస్తున్నారు. కావాలనే అసెంబ్లీలో పవన్‌ను గెలికి.. ఇప్పుడు కవర్ డ్రైవ్ చేస్తున్నాడని.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమని అంటున్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమకు సీటు రానివ్వమని.. ఆ సీటును జనసేన కైవసం చేసుకుంటుందని కామెంట్స్ పెడుతున్నారు.