BJP Nitish Rane: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడి వారం రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటి పట్టునే ఉంటూ కోలుకుంటున్నారు. అయితే సైఫ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయినప్పుడ ఆయన మెడ దగ్గర చిన్న బ్యాండేజ్, చేతికి కట్టు మాత్రమే ఉన్నాయి. అసలు ఆరు సార్లు కత్తిపోట్లకు గురైన వ్యక్తి ఇంత త్వరగా కోలుకోవడంపై.. పైగా ఆరు గంటల పాటు శస్త్రచికిత్స చేసిన వ్యక్తి ఇలా అసలు ఏమీ జరగనట్లు బయటికి రావడంపై భారతీయ జనతా పార్టీ అనుమానం వ్యక్తం చేస్తోంది. BJP నేత నితీష్ రాణే సైఫ్‌పై షాకింగ్ వ్యాఖ్యలు చేసారు. అసలు సైఫ్‌పై నిజంగానే దాడి జరిగిందా లేక నటనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు.
స్వయంగా లీలావతి వైద్యులే ఆరు గంటల పాటు శస్త్రచికిత్స జరిగిందని చెప్పారని.. మరి అంత త్వరగా ఆ మనిషి ఎలా కోలుకుని డిశ్చార్జి అయ్యాడని నిలదీస్తున్నారు. అంతేకాదు.. సైఫ్ చెత్తతో సమానమని అతను లేకపోవడమే మంచిది అనే అర్థం వచ్చేలా కామెంట్స్ చేసారు. బంగ్లాదేశ్‌కి చెందిన వ్యక్తి సైఫ్‌పై దాడి చేసాడంటే అతను తనతో పాటు సైఫ్‌ను వెంటబెట్టుకుని బంగ్లాదేశ్‌కు తీసుకెళ్లేందుకే వచ్చి ఉంటాడని.. ఇలాంటి చెత్త భారత్ నుంచి వెళ్లిపోవడమే మంచిదని అన్నారు. గతంలో హిందూ అయిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకుంటే అజిత్ పవార్ కానీ సుప్రియా సూలే కానీ ఎవ్వరూ ముందుకొచ్చి ఒక్క మాట మాట్లాడలేదని.. ఇప్పుడు ముస్లిం నటుడి పట్ల చిన్న ఎటాక్ జరగగానే అదేదో ముంబై మొత్తంలో మనిషికి రక్షణ లేకుండాపోతోందంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. (BJP Nitish Rane)
మరోపక్క సైఫ్ అలీ ఖాన్ అంత త్వరగా ఎలా కోలుకుంటాడు అని ఎగతాళి చేస్తున్న వారికి లీలావతి హాస్పిటల్ వైద్యులు గట్టిగా బుద్ధిచెప్పారు. సైఫ్‌పై సర్జరీ చేసిన వైద్యుడు తన తల్లి కాలికి ఆపరేషన్ అయిన రోజే నడవగలిగిందని.. సైఫ్ చాలా ఫిట్‌గా ఉన్నాడు కాబట్టి ఇంకా త్వరగా కోలుకున్నాడని తెలిపారు. ఈ విషయాన్ని రాజకీయం చేసుకుంటే చేసుకోండి కానీ దయచేసి వైద్యులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయొద్దని అన్నారు. మరోపక్క భారతీయ జనతా పార్టీ మతం పేరిట చేస్తున్న తప్పుడు వ్యాఖ్యలపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్పందించారు. ఆయన కూడా ఎన్డీయే కూటమిలో ఉన్నందున భారతీయ జనతా పార్టీ నేతకే సపోర్ట్ చేయాల్సి వస్తోంది. అయితే ఇలాంటి అనుమానాలు ఏమన్నా ఉంటే నేరుగా హోంమంత్రితో చర్చిస్తే బాగుంటుందని.. సైఫ్ ముస్లిం అయినంత మాత్రాన పద్మశ్రీ అవార్డు గ్రహీతను పట్టుకుని చెత్త, చస్తే బాగుండు అనడం సబబు కాదని మందలించారు.