Mokkulu: ఏదన్నా ఒక ఆపద వచ్చింది.. సమస్య వచ్చింది అనగానే ముందుగా చాలా మంది చేసే పని ఏంటంటే.. దేవుడిని మొక్కుకుంటూ.. స్వామీ ఈ కష్టం తీరిస్తే మొక్కు తీర్చుకుంటాను అని మొక్కేస్తుంటారు. కానీ సమస్య నుంచి గట్టెక్కేసాక ముందనుకున్న మాట మర్చిపోతుంటారు. మర్చిపోకపోయినా ఇప్పుడు అంత తొందరేముంది అంటూ వాయిదాలు వేస్తుంటారు.
మొక్కులు తీర్చుకోకపోయినా.. ఆలస్యం చేయకపోయినా ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? మనం అందరం సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం. సత్యనారాయణ వత్ర కథ ఇదే కదా..! ఓ మొక్కు మొక్కటం.. దాన్ని తీర్చకపోవడం ఆ తర్వాత చేద్దాం అంటూ వాయిదా వేస్తుండడం… ఇలా మొక్కులు తీర్చడం మర్చిపోతే ఏం జరుగుతుందో సత్యనారాయణ వ్రత కథలో చెప్తారు. మొక్కులు తీర్చకపోతే దేవుడు పగ తీర్చుకుంటాడా అనే ప్రశ్న ఎప్పుడూ వేయకూడదు.
అసలు మనకు ప్రధానంగా మాటను నిలబెట్టుకునే గుణం ఏది? మనం దేవుడికి ఇచ్చిన మాట నిలబెట్టలేకపోతే ఇక మనుషులు లెక్క ఎలా ఉంటారు? మనిషికి భగవంతుడికి ఇచ్చిన మాటే నిలబెట్టుకునే గుణం లేకపోతే ఇక ప్రపంచంలో ఎవరికి జవాబుదారీగా ఉంటాం చెప్పండి. మనకు జవాబుదారీతనాన్ని నేర్పించడం కోసమే మొక్కని మొక్కు తీర్చకపోతే కొంప మునిగిపోతుంది అని చెప్తారు. సత్యనారాయణ వ్రత కథలో మొక్కు తీర్చలేని ఓ సాధువు ఒకసారి అరెస్ట్ అవడం.. ఒకసారి నదిలో తన పడవలో ఉన్న రత్నాలు రాశులు మునిగిపోవడం, అల్లుడితో సహా పడవ మునిగిపోవడం.. ఇవన్నీ మొక్కులు తీర్చకపోయినందుకే కదా వచ్చిన చిక్కులు.
మొక్కు అంటే ఏంటంటే.. మనం ఒక మాటిచ్చాం. ఈ ఆపద గట్టెక్కించు. నేను నీకు ఫలానాది చేస్తాను అని మనం మొక్కుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి అనే జవాబుదారీతనం ఉండటమే. మీరు 100 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నారనుకోండి.. లేదా ఒక ఐదు కిలోల పులిహోర వండి పెడతాను అని మొక్కుకున్నారనుకోండి.. ఈ కొబ్బరికాయలు, పులిహోర కోసం దేవుడు మీ కోరిక నెరవేర్చేస్తాడు అనుకుంటున్నారా? ఆయనకెందుకు ఇవన్నీ? అసలు ఆ కొబ్బరికాయలు, పులిహోర మీ దగ్గర ఎక్కడున్నాయి? అన్నీ ఆ పరమాత్ముడికే కదా సొంతం.
ఇక్కడ మీరు మొక్కే దైవం చూసేది ఒక్కటే. వీడు నన్ను ఓ కోరిక కోరాడు. అది తీరిస్తే ఏదో ఇస్తానని మొక్కుకున్నాడు.. అసలు కోరిక నెరవేరాక మొక్కు తీర్చాలన్న తపన, బుద్ధి ఉన్నాయా లేదా అని మాత్రమే చూస్తాడు. అంతేకానీ.. అబ్బా వీడి కోరిక నేను తీర్చేసాను నాకు బంగారు ఆభరణాలు సమర్పించేస్తాడు.. నాకు 101 కొబ్బరికాయలు కొట్టేస్తాడు అని ఏ దైవం అనుకోదు. భగవంతుడు ఎప్పుడూ మన పూజా లోపాన్ని చూడడు. మన శ్రద్ధా లోపాన్ని మాత్రమే చూస్తాడు. ఈ ఒక్కటి గుర్తుంచుకోండి.
అయితే.. ఈ మొక్కుల విషయంలో పెద్దలు ఓ మాటంటారు. వేల్పుల మొక్కులు వెయ్యేళ్లు అని. అంటే మనం దైవానికి మొక్కిన మొక్కుని వెయ్యేళ్ల వరకు ఎప్పుడైనా తీర్చవచ్చు అని. అలాగని కావాలని మొక్కులు వాయిదా వేయడం మంచిది కాదు. మీకు ఈ ఏడాది మొక్కు తీర్చడం కుదరలేదు అనుకోండి. వచ్చే ఏడాది తీరుస్తానని స్వామికి కానీ అమ్మవారికి కానీ చెప్పండి. మీ వాయిదాలో నిజాయతీ ఉండాలి తప్ప శ్రద్ధా లోపం.. ఆ ఏమౌంతుదిలే అనే నిర్లక్ష్యం మాత్రం అస్సలు ఉండకూడదు. మొక్కులు మొక్కడంలో తప్పు లేదు కానీ శక్తికి, స్తోమతకు మించినవి దయచేసి మొక్కుకోకండి.