Ambati Rambabu: అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు చేయాలా వద్దా అని చెప్పడానికి ఎవరికీ అధికారం లేదు. అది ఆయన ఇష్టం. నచ్చితే చేస్తారు. లేదంటే లేదు. ప్రస్తుతానికి ఆయన ఖాతాలో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. ఓజీ సెప్టెంబర్‌లో, ఉస్తాద్ భగత్ సింగ్ డిసెంబర్‌లో కానీ జనవరిలో కానీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఆయనే స్వయంగా తెలిపారు. అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పవన్ సినిమాలు చేస్తే ఎంత చేయకపోతే ఎంత?
ఆ పార్టీ మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబు పవన్ మిగిలిన్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా త్వరగా పూర్తి చేసేయాలంటూ ఓ వీడియో రిలీజ్ చేసారు. అసలు ఆయన సినిమాల గురించి రాంబాబుకి ఎందుకు? ఇక్కడే అసలు పాయింట్ ఉంది. పవన్ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అయ్యాక హరిహర వీరమల్లు టికెట్ రేట్లను రూ.600 వరకు పెంచుకున్నారని.. ఇది కచ్చితంగా అధికార దుర్వినియోగం అని ఆరోపణలు చేస్తూనే చిత్ర పరిశ్రమను తమవైపు లాక్కోవాలని వైసీపీ పావులు కదుపుతున్నట్లు అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే.. హరిహర వీరమల్లు సినిమా దాదాపు ఐదేళ్ల పాటు సెట్స్ మీదే ఉంది.
దాంతో నిర్మాత ఏఎం రత్నం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. అలా ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను కూడా రాజకీయాల కారణంగా పక్కకు పెట్టేసి ఆ సినిమా నిర్మాతల కడుపుకొట్టకండి అంటూ రాంబాబు పవన్‌ను రిక్వెస్ట్ చేసారు. ఆ రెండు సినిమాలు పూర్తి చేసాక పవన్ సినిమాల్లో నటించడం నటించకపోవడం ఆయన ఇష్టమని అన్నారు. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినప్పటికీ బ్లాక్ బస్టర్ అంటూ రుద్దుతున్నారని.. ఈ సినిమా ఫ్లాప్ అయినందుకు తాను చింతిస్తున్నాను అంటూ చురకలంటించారు.