60 ఏళ్ల సినీ ప్రస్థానం.. ఒకటి కాదు రెండు కాదు.. అప్పట్లో ఏకంగా 500 సినిమాలు. ఆ 500 సినిమాల్లో 130 సినిమాలు ఒకే హీరోతో. అందులో 50 సినిమాలు ఏ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయంటే.. అవి గిన్నీస్ రికార్డుల్లో కూడా ఎక్కాయి. 17 ఏళ్లకే సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తెలుగు, తమిళం, మలయాళం, ఉర్దూ భాషల్లో 500లకు పైగా సినిమాల్లో నటించింది. అప్పట్లో హీరోలకంటే అత్యధిక పారితోషికం తీసుకునేది.
దక్షిణాది పరిశ్రమ నుంచి స్క్రిప్ట్ రాసుకుని దర్శకత్వం వహించిన ఏకైక నటి కూడా ఆమే. ఆమె ఎవరో కాదు.. షీలా దేవి. మన తరానికి ఈమె పెద్దగా తెలీక పోవచ్చు. మన తల్లిదండ్రులకు మాత్రం బాగా సుపరిచితురాలు. అప్పట్లో ఆమె అందానికి ఫిదా అవ్వని మగాడు లేడంటే అతిశయోక్తి కాదు. ఆమె అసలు పేరు సెలీన్. కానీ అలనాటి తమిళ నటుడు షీలా దేవి అని పేరు మార్చారు. ఇంకా ఈమెని గుర్తుపట్టలేదా? సరే.. మనకు బాగా సుపరిచితమైన చంద్రముఖి సినిమా ఉంది కదా.. అందులో నాజర్ అక్కగా రజనీకాంత్‌ను ద్వేషించే పాత్రలో కనిపించారు కదా.. ఆవిడే.. ఈవిడ.
ఇకపోతే.. ఏ నటికి కూడా ఒకే హీరోతో ఒకేసారి ఐదు సినిమాల్లో నటించే అవకాశం కూడా పెద్దగా రాకపోవచ్చు. కానీ షీలా దేవి మాత్రం ఒక హీరోతో ఏకంగా 130 సినిమాల్లో నటించారంటే నమ్ముతారా? ఆ హీరో పేరు ప్రేమ్ నజీర్. హీరో, హీరోయిన్లుగా అత్యధిక సినిమాల్లో నటించిన జంటగా వీరిద్దరూ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి కూడా ఎక్కారు. వీరిద్దరూ నటించిన 130 సినిమాల్లో 50 సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పాటు గిన్నీస్ రికార్డుల్లో కూడా చోటు సంపాదించుకున్నాయి.