Adimulapu Suresh: త్రిపురాంతకం ఎంపీపీ, పుల్లలచెరువు వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ లోపాయికారిగా తెలుగు దేశం పార్టీకి సపోర్ట్ చేసారని అంటారు. వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌కు వ్యతిరేకంగా పనిచేసేవారు అన్న ప్రచారమూ ఉంది. వైసీపీ అభ్యర్ధులు గెలవకుండా చేసేందుకు సురేష్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విషయం తెలుసుకున్న ఫ్యాన్ పార్టీ పెద్దలు సురేష్‌ను పిలిచి మందలించారట. ఎర్రగొండపాలెంలో వేలు పెడితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారట.
కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన ఆయన టిడిపితో జట్టు కట్టడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు తెలుగు దేశం పార్టీతో టచ్‌లో ఉంటూ మరో వైపు వైసీపీని బలహీన పర్చేందుకు ప్రయత్నిస్తున్న సురేష్‌పై క్యాడర్ ఆగ్రహంగా ఉంది. వైసీపీని వీడి టీడీపీలో చేరనున్నారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే గతంలో కొందరు తెలుగు దేశంలో చేరడం యాధృశ్చికం కాదని పక్కా ప్లాన్ ఉందని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు.
అయితే.. తన అనుచరులు తెలుగు దేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం వారి ఇష్టం. ఈ వ్యవహారంతో సంబంధం లేదు అన్నది ఈ మాజీ మంత్రి వాదన. కానీ సురేష్ పార్టీ మారచ్చు అన్న ప్రచారం మాత్రం రోజురోజుకు పెరుగుతోంది. ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ను బీట్ చేసి పార్టీ బాధ్యతలు చేపట్టడం… లేదా సైకిల్ ఎక్కే ప్రయత్నం చేస్తూ అన్ని వ్యవహారాల్లో వేలు పెడుతున్న సురేష్ వ్యవహార శైలి అనుమానాలకు తావిస్తోంది. కూటమి కోసం పనిచేస్తున్న విమర్శలు ఉన్నాయి. ఫ్యాన్ పార్టీలో ఉంటూ అధికార టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ నేతలే వేలెత్తి చూపే పరిస్థితి ఉంది. నియోజకవర్గంలోని తన అనుచరులను సైకిల్ ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
గత ఎన్నికల్లో తన నుంచి చేజారిపోయిన ఎర్రగొండపాలెంలో తాత్కాలికంగా వైసీపీని బలహీనపరిచి తిరిగి నియోజకవర్గాన్ని దక్కించుకోవాలని అనుకుంటున్నారట. దాంతో ఈ మాజీ మంత్రి వ్యవహారం ఫ్యాన్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. 2009లో కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సురేష్ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో వైసీపీలో చేరిన సంతనూతలపాడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక 2019లో ఎర్రగొండపాలెం నుంచి గెలిచి జగన్ క్యాబినెట్‌లో ఐదేళ్లు మంత్రిగా పనిచేసారు.
అయితే.. గత ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్‌ను కొండపి నియోజకవర్గానికి మార్చడంతో ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేసారు. అయితే.. తిరిగి ఎర్రగొండపాలెం వెళ్లాలంటే సిట్టింగ్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ అడ్డంకిగా ఉన్నారు. దీంతో చంద్రశేఖర్‌కు చెక్ పెడితే తాను తిరిగి రావచ్చు అనుకన్నారో ఏమో కానీ సొంత పార్టీకే డ్యామేజ్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. తాటిపర్తికి వెన్నుపోటు పొడిచేలా సురేష్ వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ పార్టీకి బలమైన నియోజకవర్గం ఇది. అందుకే ఎర్రగొండపాలేన్ని ఎలాగైనా దక్కించుకోవాలని తన అనుచరులను తెలుగు దేశం పార్టీలోకి వెళ్లేలా దారులు వేస్తున్నారట.