Viral Penguin Story ఈరోజుల్లో ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా యాప్స్‌లో ఓ పెంగ్విన్ అలా ఒంటరిగా నడుచుకుంటూ పర్వతాల్లోకి వెళ్లిపోతున్న వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మీరూ చూసే ఉంటారు.
ఆ పెంగ్విన్‌ని చూసిన ప్రతీసారి గుండె బరువెక్కక మానదు. అసలు ఏంటీ పెంగ్విన్ కథ.. ఎందుకు అలా ఒంటరిగా వెళ్లిపోయింది.. బతికే ఉందా? వంటి విషయాలను తెలుసుకుందాం.
మీరు ఇప్పుడు చూస్తున్న ఆ పెంగ్విన్ వీడియో ఏదైతే ఉందో అది ఇరవై ఏళ్ల క్రితంది. Encounters at the End of the World అనే డాక్యుమెంటరీలోనిదే ఆ వీడియో క్లిప్. వెర్నెర్ హెర్జాగ్ ఈ డాక్యుమెంటరీని చిత్రీకరించారు.
అంటార్కిటికాలోని 70 కిలోమీటర్ల మేర ఉన్న ద్వీపంలో ఆ పెంగ్విన్ నడుచుకుంటూ వెళ్లింది. ఈ పెంగ్విన్ అడెలె జాతికి చెందినది.
1800ల కాలంలో జ్యూల్స్ డ్యమోంట్ అనే ఫ్రాన్స్‌కి చెందిన అన్వేషకుడు తన భార్య అడెలెపై ప్రేమతో అంటార్కిటికాలోని ద్వీపానికి అడెలె అని పేరు పెట్టారు. దాంతో అక్కడ కనిపించే పెంగ్విన్స్ జాతిని అడెలె పెంగ్విన్స్ అని పిలవడం మొదలుపెట్టారు.
ఆ పెంగ్విన్ అలా తన మందను వదిలేసి ఒంటరిగా వెళ్లిపోవడానికి కారణం దానికేదైనా దెబ్బ తగలడం, అనారోగ్యం, దానికి అసలు ఏం జరుగుతుందో అర్థంకాక ఒక విధమైన ట్రాన్స్‌లోకి వెళ్లిపోవడం.. ఇలా ఏదైనా కావచ్చు.
అంతేకానీ అది ఒంటరైపోయిందనో.. లేకా హార్ట్ బ్రేక్ అయ్యిందనో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలు కల్పితం మాత్రమే. అయితే.. దురదృష్టవశాత్తు ఆ పెంగ్విన్ అదే ద్వీపంలో చనిపోయింది.





