KTR చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న తుగ్లక్‌ని ఈరోజు కళ్లారా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో చూస్తున్నామంటూ సెటైర్లు వేసారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. ఈరోజు ఆయన తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా KTR మాట్లాడుతూ..
చారిత్రకంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలుగా పెద్ద నగరంగా విస్తరించాయి.
ఈ రెండు నగరాలు ప్రపంచవ్యాప్తంగా జంట నగరాలుగా పేరుపొందాయి.
గతంలో పుస్తకాల్లో చదువుకున్న తుగ్లక్ గురించి ఈరోజు అందరికీ కనిపిస్తున్నది…
తుగ్లక్ పాలన అంటే ఎట్లా ఉంటుందో రేవంత్ రెడ్డిని చూసి అర్థం చేసుకుంటున్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం పిచ్చోడు చేతిలో రాయిలా మారింది.
ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చావు…
హామీల అమలును పక్కనపెట్టి కేవలం పేర్లు మార్చడంపైనే ఫోకస్ పెట్టాడు.
మొదట TS తీసేసి TG అన్నారు…
ఆ తర్వాత తెలంగాణ తల్లిని మార్చారు…
తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను తీసేశారు…
అధికార చిహ్నం నుంచి కాకతీయ కళా తోరణాన్ని, చార్మినార్‌ను తీసివేశారు.
వీటన్నిటి వలన ప్రజలకు ఏమాత్రం లాభం జరిగిందో ప్రభుత్వం చెప్పాలి.
ఇలాంటి పిచ్చి పనులు తుగ్లక్ పనులు తప్పించి రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు.
ప్రజల దగ్గరికి పాలన పోవాలని, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలని వికేంద్రీకరణను ఒక విశాల దృక్పథంతోనే కేసీఆర్ ప్రారంభించారు.
కొత్త గ్రామాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను ఏర్పాటు చేశారు.
10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చారు…
హైదరాబాదులోనూ వార్డులను, జోన్లను పెంచడం జరిగింది.
వాటికి అభివృద్ధి నిధులను కూడా అధికంగా ఇవ్వడం జరిగింది.
హైదరాబాద్–సికింద్రాబాద్ అనేది తెలంగాణ ప్రజల గొప్ప అస్తిత్వ చిహ్నాలు.
కానీ రేవంత్ రెడ్డి తీసుకున్న తుగ్లక్ నిర్ణయం వలన సికింద్రాబాద్‌కు చారిత్రక గుర్తింపు పూర్తిగా పోయేటట్లు ఉంది.
సికింద్రాబాద్‌లోని అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై… ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.
ప్రజలంతా సంఘటితమై… మా పార్టీని ఆహ్వానించడం జరిగింది.
అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మొత్తం మా పార్టీకి చెందిన వారే.
సికింద్రాబాద్‌లో పుట్టిన బిడ్డలుగా సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడాలి అని…
సికింద్రాబాద్ ప్రజలు పోరాటం చేస్తున్నారు.
అధికారం ఇచ్చింది పట్టణాల అస్తిత్వాలను, ప్రజల అస్తిత్వాలను గుర్తు లేకుండా చెరిపివేయడం కోసం కాదు…
అధికారం ఇచ్చింది గ్యారెంటీలను అమలు చేయడానికి,
ప్రజలకు మంచి చేయాలని…
కానీ ఇలాంటి ఒక్క పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి చేయడం లేదు.
హైదరాబాద్ నగరంలో రెండు సంవత్సరాలుగా ఒక్క ఇటుక కూడా పెట్టలేదు…
ఒక్క రోడ్డు కూడా వేయలేదు…
ఒక ఇల్లు కూడా కట్టలేదు…
కానీ నగరం మొత్తం తన విధ్వంస ప్రణాళికలతోనే ముందుకు పోతున్నాడు.
ఈరోజు శాంతి ర్యాలీ పేరుతో సికింద్రాబాద్ ప్రజలు, ప్రజాప్రతినిధులు ఒక కార్యక్రమాన్ని శాంతియుతంగా చేపట్టారు.
ప్రజల కోరిక మేరకు, ప్రజాప్రతినిధుల కోరిక మేరకు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి వెళ్తామని సిద్ధంగా ఉన్నాము.
కానీ నిన్న రాత్రి వరకు అనుమతి ఉందని చెప్పి,
ఇప్పుడు అనుమతి లేదని చెప్పి వేలాది మందిని, కార్పొరేటర్లను, మాజీ కార్పొరేటర్లను, పార్టీ సీనియర్ నాయకులను, సాధారణ ప్రజలను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం జరిగింది.
ఇంత అరాచకంగా, అక్రమంగా పనిచేస్తున్న ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. అధికారం శాశ్వతం కాదు అని.
ఇప్పుడున్న పదవిలో ఎల్లకాలం కొనసాగడు రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఇప్పటికైనా సికింద్రాబాద్ అస్తిత్వాన్ని చెరిపివేసే ప్రయత్నం మానుకోవాలి.
ఈరోజు శాంతి ర్యాలీని భగ్నం చేశామని చెప్పి రేవంత్ రెడ్డి, ఆయన ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందవచ్చు.
కానీ ఇది తాత్కాలికం మాత్రమే.
రాజ్యాంగబద్ధంగా నిరసన తెలిపే మా హక్కును కచ్చితంగా ఉపయోగించుకుంటూ మరోసారి కోర్టుకు వెళ్లి శాంతి ర్యాలీని నిర్వహించుకుంటాం.
కేవలం శాంతి ర్యాలీ మాత్రమే కాకుండా, అనేక ఇతర కార్యక్రమాలతో సికింద్రాబాద్ ప్రజల పోరాటానికి అండగా ఉంటాం.
మరోసారి తిరిగి ప్రజల ఆశీర్వాదంతో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది.
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సికింద్రాబాద్‌ను మరొక జిల్లాగా మారుస్తాం.
ప్రజల ఆకాంక్షల మేరకు వారి డిమాండ్లన్నింటిని రాబోయే మా ప్రభుత్వంలో నెరవేర్చడం జరుగుతుంది.
ఫ్యూచర్ లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ కడతామని అంటున్నాడు…
10 సంవత్సరాల తర్వాత ఉన్న జిల్లాలను తీసివేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నాడు…
చిన్న జిల్లాలతో ప్రజల దగ్గర అధికారులు వస్తే రేవంత్ రెడ్డికి ఉన్న నొప్పి ఏమిటో అర్థం కావడం లేదు.
రాష్ట్ర సచివాలయం కంటే గొప్పగా కట్టుకున్న సమీకృత కలెక్టరేట్ల ద్వారా ప్రజలకు పాలన అందుతుంటే రేవంత్ రెడ్డికి ఏం సమస్య ఉందో అర్థం కావడం లేదు.
ఈరోజు వేలాది మందిని ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. వారందరినీ వెంటనే భేషరతుగా విడుదల చేయాలి.
ఎక్కడికక్కడ ప్రజలను అరెస్టు చేయడం… ప్రజలకు నిరసన తప్ప లేకుండా చేయడమే ప్రజాపాలన.
తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై రాహుల్ గాంధీ స్పందించాలి.
అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఆయన గుర్తించాలి.
ఇంత దారుణంగా, అక్రమంగా, అన్యాయంగా వ్యవహరించడమే రాజ్యాంగ స్ఫూర్తి అనే విషయాన్ని రాహుల్ గాంధీ చెప్పాలి.





