Chandrababu Naidu ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కేంద్రంపై అసహనంతో ఉన్నారా? ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు తర్వాత.. ముందు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ నేత అయిన జగన్ మోహన్ రెడ్డిని జైలుకు పంపడమే ముందున్న కర్తవ్యం అన్న చందాన తెలుగు దేశం పార్టీ పని చేస్తోందన్న విషయం అందరికీ అర్థమవుతోంది.
నిన్న చంద్రబాబు ప్రెస్ మీట్‌లో పోలవరం గురించి మాట్లాడుతూ.. అసందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేసారు. ప్రాజెక్టులు, కేసులు ఈ అంశాలను బేస్ చేసుకుని మాట్లాడుతూ.. ఉదాహరణకు జగన్ కేసులు ఉన్నాయి.. అవి విచారణ పూర్తి కావాలంటే మరో 30 ఏళ్లు పడుతుంది అన్నారు. ఈ మాట వెనుక ఆయనలో ఉన్న అసహనం స్పష్టంగా తెలుస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయి.. ఆయన దిగిపోతాడు.. ఆయన్ను అక్రమ ఆస్తుల కేసులో జైలుకి పంపుతారని పచ్చ మీడియా తెగ ఊదరగొట్టింది. ఎన్నికలకు ముందు ప్రచార కార్యక్రమాల్లో కూడా తెలుగు దేశం పార్టీ నేతలు ఈ వ్యాఖ్యలు పదే పదే చేసారు.
2014 నుంచి 2019 మధ్యలో జగన్‌కు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ, అమిత్ షాలతో మంచి సాన్నిహిత్యం ఉందని అందుకే ఆయన్ను అక్రమ ఆస్తుల కేసులో కానీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్‌ను అరెస్ట్ చేయలేదు అని తెలుగు దేశం పార్టీ ఆరోపణలు చేస్తూ భారతీయ జనతా పార్టీతో పొత్తు నుంచి బయటికి వచ్చింది. ఈ విషయాన్ని మోదీ పార్లమెంట్‌లో ప్రస్తావించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ట్రాప్‌లో పడి తెలుగు దేశం పార్టీ యూటర్న్ తీసుకుని వెనక్కి వెళ్లిపోయారు అని.
ఇప్పుడు కూడా తెలుగు దేశం పార్టీ కేంద్రంతో చర్చలు జరిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూపాయి తెచ్చింది లేదు కానీ.. జగన్ కేసులను త్వరగా తేల్చేసి అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేదే ఆంధ్రప్రదేశ్‌లో వినపడనివ్వకుండా చేయాలని వేడుకుంటున్నట్లు తెలుస్తోంది.





