Indore Tragedy: పెళ్లైన పదేళ్లకు పుట్టిన మగ బిడ్డ. తమ పూజలకు దేవుడు కనికరించి ఇచ్చిన ప్రసాదంగా భావించింది ఆ కుటుంబం. కానీ ఐదు నెలలకే ఆ సంతోషాన్ని దూరం చేస్తాడని కలలో కూడా ఊహించలేదు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో నీరు విషపూరితం కావడంతో దాదాపు 11 మంది మృత్యువాతపడ్డారు. వారిలో ముక్కుపచ్చలారని పసికందులు కూడా ఉన్నారు. దాదాపు 1400 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇండియాలో అత్యంత శుభ్రమైన నగరంగా పేరొందిన ఇందోర్లో నీరు ఎలా కలుషితంగా మారాయో ఇప్పటికీ అంతు చిక్కడం లేదు.
ఇందోర్కి చెందిన సునీల్, కింజల్ దంపతుల బాధ జీర్ణించుకోలేనిది. పాప పుట్టిన తర్వాత పదేళ్లకు మగబిడ్డ జన్మించిన ఆనందంలో ఉన్నవారి గుండెల్లో పిడుగు పడినట్లైంది. కుటుంబంతా జీవచ్ఛవాలుగా ఉన్నారు. బిడ్డను కన్నాక కింజల్కు చనుబాలు రావడంలేదని వైద్యులు ప్యాకెట్ పాలలో కాస్త నీళ్లు కలిపి పట్టించాలని అన్నారు. అయితే.. ఇందోర్లో కలుషిత నీరు వస్తోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏ అధికారులూ హెచ్చరించకపోవడంతో బిడ్డకు ట్యాప్ వాటర్ నీళ్లను ప్యాకెట్ పాలలో కలిపి పట్టించారు. దాంతో ఆ బిడ్డ పాలు తాగిన కొన్ని నిమిషాల్లోనే అస్వస్థతకు గురై చనిపోయాడు.





