Mehbooba Mufti: ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోట పేలుడుపై (Delhi Red Fort Blast) జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, PDP లీడర్ మెహబూబా ముఫ్తీ షాకింగ్ కామెంట్స్ చేసారు. కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్‌లో విషపూరిత వాతావరణాన్ని నెలకొల్పిందని, యువతను కాశ్మీర్ ముస్లింలను బయటి ప్రపంచానికి తప్పుగా చూపిస్తున్నందుకే ఈ పేలుడు సంభవించిందని అన్నారు. కాశ్మీరీల ఘోష ఎర్రకోటలో వినిపించిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.
కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ ముస్లింల పట్ల చూపిన వివక్ష వల్లే ఆ పేలుడు సంభవించిందని.. వారి కోపాన్ని ఎర్ర కోటలో తీర్చుకున్నారని అన్నారు. కాశ్మీర్‌లో చదువుకున్న యువత ఇలాంటి పేలుళ్లకు పాల్పడుతున్నారంటే ఇక్కడి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటివరకు కాశ్మీర్‌లో అంతా బాగానే ఉంది అని కేంద్ర ప్రభుత్వం బయటి ప్రపంచాన్ని నమ్మిస్తూ వచ్చినప్పటికీ అదంతా అబద్ధమే అని ఎర్ర కోట పేలుడు రుజువు చేసిందని అన్నారు. జాతీయ భద్రతను కాపాడే యత్నం చేయకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతీసారి హిందూ ముస్లిం అంటూ రాజకీయాలు చేసిందని.. దాని పరిణామం కారణంగా 13 మంది అమాయకులు బలైపోయారని వ్యాఖ్యానించారు.
మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ముఫ్తీ ఇలాంటి షాకింగ్ వ్యాఖ్యలు చేయడంపై భారతీయ జనతా పార్టీకి చెందిన పలువురు నేతలు అసహనం వ్యక్తం చేసారు. ఏమీ స్పందించకపోయినా ఫర్వాలేదు కానీ మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పరిస్థితులను అర్థం చేసుకోకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు అని మండిపడుతున్నారు.
గతవారం ఢిల్లీలోని ఎర్రకోటలో రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో తెల్ల హ్యుండాయ్ i20 కారులో పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ పేలుడు ఘటనలో దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కాశ్మీర్‌కి చెందిన ఉమర్ మహ్మద్ అనే వ్యక్తిని సూసైడ్ బాంబర్‌గా గుర్తించారు. ఢిల్లీకి 50 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఫరీదాబాద్ అనే ప్రాంతంలో పేలుడు జరిగిన రోజే 2,900 కిలోల పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. ఈ పేలుడులో కీలక వ్యక్తులైన ముజమ్మిల్ షకీల్, ఆదిల్ రథర్ అనే ఇద్దరు కశ్మీరీ వైద్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.





