Bihar Elections: ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఎన్డీయే కూటమితో చేతులు కలిపిన JD(U) అధినేత నితీష్ కుమార్ యాదవ్ మరోసారి బిహార్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యేల ఆస్తులు విస్మయానికి గురిచేస్తున్నాయి. 90% మంది కొత్త ఎమ్మెల్యేలు కోటీశ్వరులే అని ADR (అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రీఫార్మ్స్) వెల్లడించిన డేటాలో తేలింది.
243 మంది ఎమ్మెల్యేల్లో 214 మంది ఎమ్మెల్యేల ఆస్తులు అమాంతం పెరిగిపోయాయి. గత ఐదేళ్లలో వారి ఆస్తులు 9% పెరిగాయి. ఉదాహరణకు 2020లో ఒక ఎమ్మెల్యే ఆస్తి 4.32 కోట్లు ఉంటే 2025కి వచ్చేసరికి అది కాస్తా 9.2 కోట్లకు చేరింది. ఇక అత్యధిక ఆస్తులు ఉన్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది భారతీయ జనతా పార్టీకి చెందిన ముంగర్ నియోజకవర్గానికి చెందిన కుమార్ ప్రణయ్. ఆయన ఆస్తుల విలువ రూ.170 కోట్లు. ఇక అత్యంత పేద ఎమ్మెల్యే పీర్పైంటి నియోజకవర్గానికి చెందిన మురారీ పాస్వాన్. ఈయన ఆస్తుల విలువ రూ.6 లక్షలు. ఇతను కూడా భారతీయ జనతా పార్టీకి చెందిన వారే. ఇక అందరు ఎమ్మెల్యేల ఆస్తుల విలువ మొత్తం కలిపితే రూ.2,193 కోట్లు ఉంటుంది.
అత్యధిక కోటీశ్వరులున్న పార్టీలు ఇవే
JDU: 85 మందిలో 78
BJP: 89 మందిలో 77
RJD: 25 మందిలో 24
LJP (RV): 19 మందిలో 16
కాంగ్రెస్: 6 మందిలో 6
మున్ముందు కూడా బిహార్‌కి చెందిన అత్యధిక మంది ఎమ్మెల్యేల ఆస్తులు మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.





