Death After Marriage 75 ఏళ్ల వృద్ధుడు.. 35 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకున్నాడు. తీరా చూస్తే.. పెళ్లైన మరుసటి రోజు ఉదయమే ఆ వృద్ధుడు మరణించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. కుచ్‌మచ్ గ్రామానికి చెందిన సంగ్రూరామ్ అనే 75 ఏళ్ల వృద్ధుడి భార్య రెండేళ్ల క్రితం చనిపోయింది. అతనికి పిల్లలు కూడా లేరు. దాంతో ఈ రెండేళ్లు ఒంటరిగా వ్యవసాయం చేసుకుంటూ బతికాడు. అయితే.. తనకంటూ ఓ తోడు కావాలని భావించిన సంగ్రూరాం పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇందుకు ఇంట్లో వారు ఒప్పుకోలేదు.
అయినా ఆయన వినకుండా స్థానిక జలాల్‌పూర్ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల మన్‌భవతి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కోర్టులో చట్టప్రకారం పెళ్లి చేసుకున్నాక ఆలయంలో సంప్రదాయంగానూ వివాహం జరిపించారు. వివాహం జరిగిన మరుసటి రోజు ఉదయం సంగ్రూరామ్ అస్వస్థతకు గురవడంతో ఆయన్ను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మృతిచెందాడని వైద్యులు చెప్పడంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రాత్రంతా తాము చాలా సేపటి వరకు మాట్లాడుకున్నామని.. అప్పటికి ఆయన ఆరోగ్యం బాగానే ఉందని యువతి చెప్తోంది. అయితే.. ఆయన మరణం వెనుక అనుమానాలు ఉన్నాయని పోస్ట్‌మార్టం నిర్వహించాకే అంత్యక్రియలు జరపాలని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.