Bandla Ganesh Speech: చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో పెద్ద మాఫియా ఉందని.. ఆ మాఫియా ఎప్పుడు పైకి లేపుతుందో ఎప్పుడు తొక్కుతుందో ఎవ్వరూ ఊహించలేరని లిటిల్ హార్ట్స్ నటుడు మౌళికి చెప్పారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని.. అప్పుడే మాఫియా చేతికి చిక్కకుండా ఉంటామని జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
బండ్ల గణేష్ మాట్లాడుతున్నప్పుడు ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, సహ నిర్మాత బన్నీ వాస్ కూడా ఉన్నారు. వాళ్ల ముందు బండ్ల గణేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. దీనిపై నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ.. బండ్ల గణేష్ చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ అని అన్నారు. సునీల్ స్టార్ కమెడియన్‌గా ఉన్నప్పుడు అతన్ని హీరోని చేసారని.. అతను అమాంతం కింద పడ్డాడని అన్నారు. మరో కమెడియన్ అయిన సప్తగిరి పరిస్థితి కూడా అంతే అని గుర్తుచేస్తూ.. దివంగత నటుడు ఉదయ్ కిరణ్‌ను ఉదాహరణగా తీసుకున్నారు. ఇలాంటి ఎందరో హీరోలే కాకుండా హీరోయిన్లు కూడా ఈ మాఫియాకి చిక్కుకుని బలైపోయిన వాళ్లు ఉన్నారని తెలిపారు. ఇప్పుడు మౌళికి ఒక పర్సనల్ అసిస్టెంట్, మేనేజర్ ఉంటారని.. మౌళి పేరు చెప్పుకుని వాళ్లు కోట్లు గడిస్తుంటారు కానీ మౌళి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని.. అందుకే బండ్ల గణేష్ అలా వద్దు అని హెచ్చరించారని తెలిపారు.
ఇక కల్కీ 2 చిత్రంలో దీపిక పదుకొణెను తప్పించడంపై కూడా నట్టి కుమార్ స్పందించారు. దీపిక ఏదో తప్పు చేస్తే ఆమెను తీసేయలేదని.. ఇచ్చిన డేట్స్‌లో షూటింగ్ కానివ్వకుండా గంటల కొద్ది కబుర్లు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నారని.. అది నచ్చక ఆమెను నిర్మాణ సంస్థే తీసేసేలా చేసుకుందని అన్నారు. ఇచ్చిన డేట్స్‌లో చకచకా షూటింగ్ అయిపో చేసి ఉంటే ఇంత దాకా వచ్చేది కాదని తన అభిప్రాయమని తెలిపారు.