Renu Desai: ఆడదంటే భర్తకో, తండ్రికో చెందిన కేవలం ఒక ప్రాపర్టీ కాదు అంటూ తన ఆవేదనను మరోసారి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు నటి రేణూ దేశాయ్. సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి (ఇప్పుడు మాజీ)గానే రేణూ చాలా మందికి సుపరిచితురాలు. వీరిద్దరూ కలిసి బద్రి, జానీ సినిమాల్లో నటించారు. కానీ రేణూ అంటే ఓ నటిగా కంటే పవన్ భార్యగానే సుపరిచితురాలు. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోవడం పవన్ వేరే వివాహం చేసుకోవడం తెలిసిన విషయమే.
అయితే ఎప్పుడైతే రేణూ సోషల్ మీడియాలోకి వచ్చారో అప్పటి నుంచి పాపం ఆమె అడుగడుగునా ఎన్నో వేదింపులు, మాటలు ఎదుర్కొన్నారు. ఏదన్నా ఒక ఫోటో పెట్టగానే వదినా అంటూ కామెంట్స్‌లోకి వచ్చేస్తుంటారు పవన్ అభిమానులు. అయితే పవన్‌తో తాను విడిపోయినప్పటికీ అభిమానులు తనను వదిన అని పిలిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని ఓసారి ఆవిడే వెల్లడించారు. కానీ కొందరు లిమిట్ దాటి కామెంట్స్ పెడుతూ ఉంటారు. వారికి ఎప్పటికప్పుడు బుద్ధి చెప్తూ రేణూ నోరుమూయిస్తూనే ఉంటారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పుటికప్పుడు తన జీవితంలో జరుగుతున్న సంతోషకరమైన విషయాల గురించి అప్డేట్ ఇస్తూ ఉంటారని తెలిసిందే. అక్కడ కూడా పెట్టిన పోస్ట్‌కి సంబంధం లేకుండా వదిన అంటూ ఏవి పడితే అవి కామెంట్స్ పెడుతుంటారని కామెంట్స్ కూడా ఆఫ్ చేసి పెట్టుకున్నారు. అయినా రేణూకి కొందరు నెటిజన్ల నుంచి అభ్యంతరకరమైన కామెంట్స్ తప్పడం లేదు. రేణూ కొలాబరేషన్ పోస్ట్‌లు పెడుతుంటే కొందరు నెటిజన్లు ఆ పోస్ట్‌లోకి వెళ్లి మరీ అక్కడ కామెంట్స్ చేస్తున్నారు.
లక్ష్మి ప్రసన్న అనే నెటిజన్ చేసిన కామెంట్‌ను రేణూ స్క్రీన్ షాట్ తీసి మరీ గడ్డిపెట్టారు. ఇంతకీ సదరు నెటిజన్ చేసిన కామెంట్ ఏంటంటే.. వదినా.. నేను మీరు ఇచ్చిన ఎన్నో ఇంటర్వ్యూలు చూసాను. అన్ని ఇంటర్వ్యూలో అకీరా నందన్ నా బిడ్డ అని చెప్పడం విన్నాను. కచ్చితంగా అకీరా మీ బిడ్డే. కానీ మా ఓజి (పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశిస్తూ) మీరు వేర్వేరు కాదు. మేం అకీరా మా అన్నయ్య కొడుకు అనగానే మీకు కోపం వచ్చేసి మీ కొడుకు అంటున్నారు. కచ్చితంగా అకీరా మా అన్నయ్య కొడుకే. కానీ కేవలం ఆయన కొడుకే అని కాదు కదా. అందులో మీరూ ఉంటారు. కేవలం మా అన్నయ్య మాత్రమే అకీరాను కనలేదు కదా. మీరు ఇప్పటికీ ఎప్పటికీ మా దేవుడు పవన్ కళ్యాణ్ భార్యే.. మా వదినే అని కామెంట్ చేసింది.
ఈ కామెంట్ రేణూ కంట పడటంతో వెంటనే స్క్రీన్ షాట్ తీసి తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసారు. ఇలాంటి వెదవలు నా ఖాతా కింద కామెంట్స్ చేస్తున్నారని కామెంట్స్ ఆఫ్ చేస్తే ఇప్పుడు కొలాబరేషన్ పోస్ట్‌లలో కామెంట్స్ పెడుతున్నారు. ఇది ఇంక ఎప్పటికి ఆగుతుంది? కొన్ని వందల సంవత్సరాలుగా ఆడదాన్ని భర్త లేదా తండ్రికి చెందిన ప్రాపర్టీగా చూస్తున్నారు. ఇది 2025. ఇప్పటికీ అలాగే చూస్తున్నందుకు బాధగా ఉంది. ఇప్పటికీ ఓ మహిళ ఉద్యోగం చేయాలంటే ఇంట్లో మగవారి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికీ మహిళలు వంట చేయడానికి మాత్రమే పనికొస్తారు అని ఆలోచిస్తున్నారు. ఇది చాలా బాధాకరం. రానున్న తరాల్లో ఆడపిల్లల పట్ల ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని నేను ఎప్పటికప్పుడు ఆడవాళ్లకు మద్దతుగా నా గళం విప్పుతూనే ఉన్నాను. కనీసం రానున్న తరాల్లో ఆడపిల్ల పుడితే భారంగా భావించి వారిని చంపేయకుండా వారికంటూ ఈ భూమి మీద ఓ స్థానం ఉండాలని కోరుకుంటున్నాను. అని తన బాధను వెళగక్కారు రేణూ.