మన భారతదేశంలో అనేక దివ్యమైన శక్తి క్షేత్రాలు ఉన్నాయి. శక్తి క్షేత్రం అంటే ఎక్కువగా జనాలు వెళ్లలేరు. ఎందుకంటే పాపాలు మాత్రమే చేసేవారు, దోషాలు ఉన్నవారు ఇలాంటి క్షేత్రాలకు వెళ్లలేరు. ఇలాంటి క్షేత్రాలకు వెళ్లాలంటే ఒక యోగం కూడా ఉండాలి. ఇలాంటి కొన్ని ఆలయాలకు తాళాలు కూడా ఉండవు. అలాంటి దివ్యమైన క్షేత్రాల్లో ఒకటి లక్ష్మీగణపతి ఆలయం. ఇది విజయవాడ నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐలూరులో ఉంది.
ఇది 300 ఏళ్ల నాటి ఆలయం. ఒక అడుగు మాత్రమే ఉంటుంది ఈ ఆలయంలోని బొజ్జ గణపయ్య విగ్రహం. ఈ ఆలయం ఒక మఠంలా పునర్నిర్మించారు. ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. మనకు ఏదన్నా కోరిక ఉన్నా, బాధ ఉన్నా, ఇబ్బంది ఉన్నా.. ఏ సమస్య ఉన్నా ఈ ఆలయంలోని బొజ్జ గణపయ్యకు అది చెప్పుకుంటే అది నెరవేరుతుందో లేదో గంటలోనే తెలిసిపోతుందట. మన కోరికలనే కాదు.. స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం కూడా ఎవరో అధికారులో, ఆలయ ధర్మకర్తలో అనుకుంటే సరిపోదు. తన ఆలయాన్ని బాగు చేయించాలా వద్దా అనేది కూడా గణనాథుడే నిర్ణయిస్తారట.
ఓసారి ఆలయ పూజారితో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి పోయిన కృష్ణా పుష్కరాలకు దీక్షలో భాగంగా పది రోజులు అక్కడే బస చేసారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. అయితే.. అప్పటికే ఆ మఠం శిథిలావస్థకు వచ్చేసిందట. వర్షం పడితే గుళ్లో తలదాచుకునే పరిస్థితి కూడా లేకుండా ఎక్కడికక్కడ నీరు కారుతూ ఉండేదట. అయితే.. ఓ రోజు అభిషేకాలు, పూజా కార్యక్రమాలు అన్నీ అయ్యాక ఒక వంద మందికి అన్నదానం ఏర్పాటు చేసారట. అదే సమయంలో ఓ ఆరగుడుల వ్యక్తి వచ్చి ఆలయ పూజారి చెవిలో గురువుగారూ.. ఈ ఏడాదన్నా మఠానికి మార్పులు చేర్పులు చేసి చక్కగా తయారుచేసుకుందామా అని అడిగాడట. ఆ వ్యక్తి చూడటానికి కూడా కాస్త గణనాథుడిలాగే కనిపించారట. ఈ విషయాన్ని తిరుపతి మూర్తి గారే స్వయంగా చెప్పారు.
అలా ఆ వ్యక్తి మఠాన్ని పునర్నిర్మిద్దామా అని అడిగిన గంటకే.. అక్కడ వేలాడుతున్న ఓ కర్ర కింద పడి అందులో నుంచి బంగారు నాణేలు బయటికి వచ్చాయట. అంటే.. నా ఆలయాన్ని బాగుచేయండి అని గణనాథుడే అనుమతి ఇచ్చారు. దాంతో చక్కగా ఆలయాన్ని, మఠాన్ని బాగు చేయించారు. ఆ ఆలయం చుట్టు పక్కల నివసించే వారు కూడా ఏదన్నా ఇల్లు కట్టోవాలన్నా.. కొత్తగా ఏదన్నా నిర్మించాలన్నా కూడా ముందు గణనాథుడికి ఆ విషయాన్ని చెప్పి ఆయన ఉంచి అనుమతి వచ్చాకే నిర్మాణ పనులు మొదలుపెడతారట. ఏదో ఒక విధంగా బంగారు నాణెం బయటపడటం.. అది స్వామి వారి నుంచి వచ్చిన అనుమతిగా భావించి భక్తులు నిర్మాణాలు చేపడుతుండడం ఆనవాయితీగా వస్తోంది. అలా కాకుండా నాకు నచ్చినప్పుడు నేను నిర్మించుకుంటాను అనుకుని నిర్మాణాలు చేయాలనుకునేవారికి ఏదో ఒక రకంగా సమస్య వచ్చి ఆ పనులు ఆగిపోతూ ఉండేవట. ఇంతటి మహిమగల క్షేత్రాన్ని వీలుంటే మీరూ ఓసారి సందర్శించేయండి..!