Delivery In Seventh Month: సాధారణంగా గర్భం దాల్చిన తొమ్మిది నెలల తర్వాతే బిడ్డకు జన్మనివ్వాలి. అప్పుడే బిడ్డ ఆరోగ్యంగా పుట్టేది. ఒకప్పుడు గర్భిణులకు తొమ్మిదో నెల్లోనే చక్కగా సహజంగా ప్రసవం అయ్యేది. కానీ ఇప్పుడున్న జీవన శైలిలో అలా కాదు. తొమ్మిది నెలలు నిండిన తర్వాత సహజ కాన్పుల కంటే సిజేరియన్ కాన్పులే ఎక్కువ అవుతున్నాయి. మరికొందరికైతే నెలలు నిండకుండానే .. అంటే ఏడో నెల్లోనే బిడ్డను బయటికి తీస్తున్నారు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఇలా ఏడో నెలలోనే పుట్టేసిన పిల్లల్లో ఎదుగుదల సరిగ్గా ఉండకపోవడం.. పలు మానసిక, శారీరక అనారోగ్య సమస్యలు తలెత్తడం చూస్తూనే ఉన్నాం. ఇక రాబోయే రోజుల్లో పరిస్థితి ఇంకా దారుణంగా మారే అవకాశం ఉంది. అంటే.. అయితే బిడ్డ లేదా తల్లిని మాత్రమే బతికించగలం అనే రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నాయనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
ఏడో నెలలో ప్రసవం
ఏడో నెలలో ప్రసవం అంటే అప్పటికి బిడ్డ కడుపులో పడి 28 నుంచి 31 వారాల పాటే అవుతోందని అర్థం. దీనిని ప్రీ టర్మ్ బర్త్ అంటారు. అలా ఏడో నెలలోనే పుట్టేస్తే బిడ్డ బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. బ్రెయిన్, ఊపిరితిత్తులు, జీర్ణకోశ సరిగ్గా ఏర్పడి ఉండవు. అలా పుట్టిన పిల్లల్ని వెంటనే వెంటిలేటర్‌పై ఉంచి నిరంతరం పరిశీలిస్తూ ఉండాల్సి ఉంటుంది. పాలు కూడా ట్యూబ్‌ను పెట్టి తాగించాలే తప్ప నేరుగా తల్లి చనుబాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. రోగనిరోధక శక్తి ఉండదు. దాంతో చిన్న పాటి ఇన్‌ఫెక్షన్లు సోకినా తట్టుకోలేరు. వీరిని కొన్ని నెలల పాటు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో ఉంచాల్సి వస్తుంది. అదృష్టం బాగుంటే వారి ఆరోగ్యం బాగైపోయి ఆరోగ్యకరంగా ఇంటికి తీసుకెళ్లచ్చు. లేదంటే.. చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువే.
ముందస్తు కాన్పు ఎప్పుడువుతుంది?
Delivery In Seventh Month సాధారణంగా గర్భిణులకు అధిక రక్తపోటు ఉన్నా.. ఏదైనా ఇన్‌ఫెక్షన్ ఉన్నా ఇలా ముందస్తు కాన్పులు అయిపోతూ ఉంటాయట. మరికొందరిలో ఏదైనా సీరియస్ అనారోగ్య సమస్యలు ఉంటే బిడ్డను ఏడో నెలలోనే సిజేరియన్ ద్వారా బయటికి తీయాల్సి ఉంటుంది. లేదంటే ఆ అనారోగ్య సమస్య బిడ్డకు కూడా సోకే ప్రమాదం ఉంటుంది.
ముందస్తు కాన్పు కాకూడదు అంటే..
ఇలా ఏడో నెలలోనే కాన్పులు కాకుండా ఉండాలంటే.. గర్భం దాల్చినప్పటి నుంచి అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. గర్భం దాల్చారు అని తెలిసినప్పటి నుంచి ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా చెకప్స్‌కి వెళ్తుండాలి. ఒంట్లో ఎలాంటి మార్పు తెలుస్తున్నా నిర్లక్ష్యం చేయకండి. కొందరు ఇవి గర్భం దాల్చినప్పుడు సాధారణమే అని చెప్తుంటారు. కొన్నిసార్లు సాధారణమే అనుకున్నవే ప్రాణాంతకంగా మారుతుంటాయి. మంచి ఆహారం తీసుకోవడం, మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం, మద్యం, ధూమపానానికి దూరంగా ఉండటం వంటివి చేస్తుండాలి. ధూమపానం పొగ పీల్చినా డేంజరే. ఇప్పుడు ప్రీనాటల్ యోగా అని చాలా మంది గర్భిణులకు చేయిస్తుంటారు. వీలైతే అలాంటివి ప్రయత్నించాలి. గర్భిణులు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉన్నా.. తక్కువ ఉన్నా ఇలా ముందస్తు కాన్పులు జరుగుతూ ఉంటాయి.