US birthright citizenship: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు అమెరికాలో ఉంటున్న విదేశీ కుటుంబాలకు షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఫిబ్రవరి 20 తర్వాత నుంచి అమెరికాలో ఉంటున్న విదేశీయులకు పిల్లలు పుడితే వారికి జన్మతః పౌరసత్వం లభించదని ట్రంప్ బాంబు పేల్చారు. దాంతో చాలా మంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎలారా నాయనా అని తలలు పట్టుకుంటున్నారు. అప్పుడే పిల్లలకు తొందరేముంది అనేవారికి ఇది నిజంగానే షాకింగ్ వార్త.
ఆల్రెడీ గర్భం దాల్చి ఉన్నవారికి కాస్త ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ.. ఫిబ్రవరి 20 లోపు సహజంగా డెలివరీలు జరిగితే ఫర్వాలేదు. కానీ ఫిబ్రవరి తర్వాత ప్రసవ తేదీలు ఉన్నవారు తెగ కంగారుపడిపోతున్నారు. ముఖ్యంగా భారతీయ మహిళలు. మార్చిలో ప్రసవం అవుతుందని వైద్యులు చెప్తున్నప్పటికీ.. ఏడో నెల. ఎనిమిదో నెల గర్భంతో ఉన్నవారు ఫిబ్రవరి 19నే సిజేరియన్ చేసి మరీ డెలివరీ చేయాలని స్లాట్లు బుక్ చేసుకుంటున్నారట. ఈ విషయాన్ని అమెరికన్ హాస్పిటల్స్‌లో పనిచేస్తున్న ఇండియన్ గైనకాలజిస్ట్‌లు వెల్లడించారు. (US birthright citizenship)
ఏ రోజైతే ట్రంప్ ఫిబ్రవరి 20 తర్వాత అమెరికనేతర మహిళలకు పుట్టబోయే పిల్లలకు జన్మతః పౌరసత్వం లభించదు అని ప్రకటించారో ఆ ఒక్క రోజే ఒక గైనకాలజిస్ట్‌కి 20 ఫోన్ కాల్స్ వచ్చాయట. వాళ్లంతా ఫిబ్రవరి 19న సిజేరియన్ చేసి బిడ్డను డెలివరీ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారట. అది సాధ్యమవుతుంది కానీ చాలా రిస్క్‌లు ఉన్నాయని.. పిల్లలకు ఎదిగే సమయంలో అనారోగ్య ఇబ్బందులు రావచ్చని.. కొన్ని అరుదైన కేసుల్లో ముందస్తు డెలివరీల వల్ల తల్లి, బిడ్డ ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారట. కానీ వారు మాత్రం వినడంలేదు. అమెరికాలో స్థిరపడటం.. తమ పిల్లలకు అమెరికన్ పౌరసత్వం రావడమే ముఖ్యమని మొరపెట్టుకుంటున్నారు.